12-01-2026 12:00:00 AM
మేడ్చల్, జనవరి11(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ ప్లాట్ల వివాదం వెనుక అధికార పార్టీ నేతల హస్తముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతోనే బిల్డర్ వెంకటేష్ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ బాధితులకు అండగా నిలిచి పలుమార్లు అక్కడికి వెళ్ళగా, కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో అసలే పట్టనట్లు వ్యవహరించడం ఆరోపణలకు బలం చేకూరుతోంది. వివాదాస్పద భూమి అని తెలిసి కూడా అధికారులు సర్వేకు వెళ్లడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.
కొర్రెములలో గ్రామపంచాయతీ ఉన్న సమయంలో 1985లో 146 ఎకరాల్లో 2086 ఫ్లాట్లు చేసి విక్రయించారు. ఈ వెంచర్ అప్పట్లో ఊరికి, పట్టణానికి దూరంగా ఉంది. తక్కువ ధరకు రావడంతో పేద ప్రజలు కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు అనువుగా లేకపోవడంతో చాలా ఏళ్లు అలాగే పడి ఉన్నాయి. ఆ తర్వాత పట్టణం విస్తరించడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ వెంచర్ లోని 47 ఎకరాలు 2006లో ఒక బిల్డర్ పేరుట పట్టాయింది. తన కొనుగోలు చేశానని బిల్డర్ వెంకటేష్ చెబుతున్నాడు. వెంచర్లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని ఆమె హక్కుదారులమని కొనుగోలుదారులు వాదిస్తున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది.
గత సంవత్సరం బిల్డర్ అనుచరులపై చేయి చేసుకున్న ఎంపీ ఈటెల
గత సంవత్సరం బిల్డర్ వెంకటేష్ ప్లాట్లను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. తన అనుచరులు కొంతమందిని అక్కడ కాపలా ఉంచాడు. వీరు ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడే ప్రతిరోజు మద్యం తాగుతూ హంగామా చేశారు. దీంతో బాధితులు ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆశ్రయించారు. కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను చూయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో ఎంపీ ఈటెల వెంచర్ను పరిశీలించడానికి వెళ్లారు. ఎంపీ వెళ్లిన సమయంలోనూ మద్యం తాగుతూ ఉండగా ఆగ్రహంతో వారిపై చేయి చేసుకొని అక్కడ్నుంచి వెళ్లే కొట్టారు. బాధితులందరూ వెంకటేష్ మనుషులను అక్కడి నుంచి తరిమేశారు. ఈ ఘటనలో అప్పట్లో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఎంపీ ఈటెల రాజేందర్ ఈ విషయమై డిజిపి, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
సర్వేకు వచ్చిన అధికారులు
వివాదం సద్దుమణిగిందని భావించిన తరుణంలో తాజాగా అధికారులు సర్వేకు రావడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. సర్వేను అడ్డుకున్నారు. దీంతో బాధితులపై వెంకటేష్ మనుషులు దాడి చేసి గాయపరిచారు. శనివారం జరిగిన ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వివాదంలో ఉందని తెలిసినా అధికారులు సర్వేకు ఎలా వచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా తమపైనే దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి న్యాయం చేయాలి
కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశామని, తమ స్థలాలను లాక్కుంటే రోడ్డుమీద పడతామని బాధితులు వాపోతున్నారు. పేదల పక్షాన ఉండాల్సిన కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ కు అండగా నిలిచారని తెలిపారు. తమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.