calender_icon.png 5 October, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి అనుబంధ సంఘంగా ఎన్నికల కమిషన్

05-10-2025 01:25:16 AM

-ప్రతి గ్రామంలో ఓట్ చోరీపై సంతకాల సేకరణ 

-పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

-జూబ్లీహిల్స్, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి 

-ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఎన్నికల కమిషన్ బీజేపీకి అను బంధ సంఘంగా పనిచేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగిందని.. ఓట్ చోరీతోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు పలు వురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోరీ సంతకాల సేకరణపై ఈ సమావేశంలో చర్చించారు.

రాహుల్ గాంధీ స్పష్ట మైన ఆధారాలతో ఓట్ చోరీను బయటపెట్టారని పేర్కొన్నారు. అంతా పకడ్బందీగా ఆధారాలు చూపించినా కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సింగిల్ బెడ్ రూమ్ ఉన్న ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నాయని, చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి కానీ, బతికి ఉన్న వారి ఓట్లు తొలగించారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ కీలక నాయకులు కేసీ వేణుగోపాల్ ఓట్ చోరీ విషయంలో దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

 గ్రామానికి వంద మందితో సంతకాల సేకరణ

 ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని, గ్రామానికి కనీసం వంద మందితో చేయించాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఓట్ చోరీ ఎలా జరిగింది... బీజేపీ ఎలా ఓట్ చోరీ చేసిందో ప్రజలకు వివరించాలన్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతి గ్రామంలో ఈ సంతకాల సేకరణ జరిగే విదంగా చూడాలని సూచించారు. 

 15నాటికి సంతకాల సేకరణ పూర్తి చేయాలి:  ఏఐసీసీ ఇన్‌చార్జి  

రాహుల్ గాంధీ ప్రధానంగా రెండు అం శాలపై పోరాటం చేస్తున్నారని, సామాజిక న్యాయం, ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా పోరా టం చేస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఈనెల 15 నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి దాన్ని ఏఐసీసీకి పంపాలన్నారు. ఏఐసీసీ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు.

రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ఇందులో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ కష్టపడి పనిచేసి విజయం సాధించాలని తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, ఆఫీసు బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, అధికార ప్రతినిధులు, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.