05-10-2025 12:15:12 AM
రెండెకరాలను ఆక్రమించుకొని చదును చేసిన వైనం
ఆక్రమణలపై ‘విజయక్రాంతి’ వరుస కథనాలతో స్పందించిన అధికారులు
మొక్కలునాటిన ఫారెస్ట్ అధికారులు
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ ౪(విజయక్రాంతి): ఆక్రమణలకు గురైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మూసివేసిన సౌత్ క్రాస్ కట్ గని స్థలాన్ని అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. గని స్థలాన్ని కొంతమంది కబ్జా చేసిన విషయాన్ని ‘విజయక్రాం తి’ దినపత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన సింగరేణి యాజమాన్యం అధికారులను ఆక్రమణలకు గురైన స్థలం వద్దకు పంపింది.
పట్టణంలోని 31వ వార్డు బాబు క్యాంపులోని పద్మశాలీ భవనానికి ఆనుకొని ఉన్న మూతబడిన సౌత్ క్రాస్ కట్ గని సుమారు రెండు ఎకరాల సింగరేణి భూమిని కొందరు అనుమతి లేకుండా చదును చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హడావుడిగా దొడ్డిదారికిగేటు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆక్రమించిన భూమిని కొత్త తరహా మోసానికి దిగజారారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని దక్కించుకునేందుకు ఆ స్థలంలో దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలు చేశారు.
సెంటిమెంట్‌గా అధికారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో సింగరేణి ఎస్టేట్ అధికారులు, ఎస్ అండ్ పీసీ విభాగo సిబ్బంది శుక్రవారం సాయంత్రం అక్రమిత స్థలాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకొని హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అలాగే ఫారెస్ట్ అధికారులతో కలసి ఆ స్థలంలో మొక్కలు నాటారు. ఎవరైనా సింగరేణి స్థలాన్ని కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని మందమర్రి జీఎం ఎన్ రాధాకృష్ణ హెచ్చరించారు. ఇలాంటి విషయంలో ఎంత టి వారిని అయినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మరోసారి సింగరేణి స్థలాన్ని ఏ రూపంలోనైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.