05-08-2025 01:48:31 AM
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణలో సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర కాగా.. మున్సిపాలిటీల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోందని అయినా ప్రభుత్వం ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ జాప్యం వల్ల గ్రామాలలో పరిపాలన పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, ఏడాదిన్నరగా ఎన్నిక లు నిర్వహించని కారణంగా కేంద్ర ఆర్థిక సం ఘం నుంచి రావాల్సిన రూ.2300 కోట్లు నిధులు రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా పారి శుధ్య కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న దురవస్థలు కనిపిస్తున్నాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ.. రాహుల్ గాంధీ నుంచి మొదలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అయినా స్థానిక సంస్థల విషయంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవడం కోసం మాత్రమే పదేపదే ఢిల్లీ టూర్ వెళ్తూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ ఇప్పటికైనా దుబారా ప్రయాణాలు బంద్ చేసి పాలనపై దృష్టిపెట్టాలని సూచించారు. దమ్ముంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలు, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.