calender_icon.png 6 August, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిపై నిర్లక్ష్యం వద్దు

05-08-2025 01:49:44 AM

- అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

- అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, వాటిపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జీహెఎంసీ అదనపు కమిషనర్ ఫైనాన్స్ రఘు ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. ప్రతి అర్జీకి గుణాత్మక, సత్వర పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. సోమవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ప్రధాన కార్యాలయంతో పాటు, జోనల్ కార్యాలయాల్లో కలిపి మొత్తం 148 వినతులు అందాయి.

అత్యధికంగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి, కూకట్‌పల్లి జోన్‌కు ఫిర్యాదులు రావడం గమనార్హం. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అధికారులతో మాట్లాడారు. “ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని విభాగాల అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే, దరఖాస్తుదారుడు అదే పనిగా మళ్లీ మళ్లీ వస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రతి వినతిని జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలి,” అని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, పద్మజ, గీతా రాధిక, సీఈ సహదేవ్ రత్నాకర్, చీఫ్ వెటర్నరీ అధికారి డా. అబ్దుల్ వకీల్, చీఫ్ మెడికల్ అధికారి డా. పద్మజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పలనితో కలిసి నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 251 అర్జీలు రాగా, అందులో సింహభాగం గృహ నిర్మాణ పథకాలకు సంబంధించినవే కావడం గమనార్హం.