06-08-2025 08:56:39 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): నగరంలోని గాయత్రి నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో బుధవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం(Police Commissioner Ghaus Alam) ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. ఈ తనిఖీలలో మొత్తం 87 వాహనాలను తనిఖీ చేయగా, సరైన ధ్రువపత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24 బైకులు, ఒక కారు ఉన్నాయి. అలాగే, నంబర్ ప్లేట్లు లేని 8 వాహనాలకు, ఒకే నంబర్ ప్లేట్ ఉన్న 25 వాహనాలకు, ఇతర నిబంధనల ఉల్లంఘనల కారణంగా 27 వాహనాలకు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా పోలీసులు స్థానిక ప్రజలకు, విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి సమాచారం ఉంటే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, సృజన్ రెడ్డి, సదన్ కుమార్, శ్రీలత, పుల్లయ్య, సహా దాదాపు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 300 మంది స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు.