06-08-2025 09:03:17 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా పంకెన గ్రామంలోని కెజిబివి పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంట గది, సైన్స్ ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జాప్యం లేదా నిర్లక్ష్యమైతే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాలని వారిలో ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు రాబొట్టొచ్చని సూచించారు. అనంతరం పలిమల మండలం కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులు, ఏం ఆర్ సి భవనాలను పరిశీలించారు.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ క్యాంప్లెక్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం నర్సరీని పరిశీలించిన కలెక్టర్, నర్సరీలో వెదురు మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. ఈ ప్రాంతం వెదురు మొక్కల పెంపకానికి అనుకూలం కావడంతో వెదురు మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు.అక్కడి నుండి పలిమేల రేంజ్ పరిధిలోని మోదేడు దట్టమైన అడవిలో పర్యటించి అటవీ శాఖ వాచ్‌టవర్, అడవుల సంరక్షణ, పెంపకానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అటవీ శాఖ వాచ్ టవర్ ప్రాంతంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అటవీ డివిజనల్ అధికారి సందీప్ రెడ్డి, పలిమెల అటవీ క్షేత్రాధికారి, తహసీల్దార్ అనిల్, ఎంపిడిఓ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.