12-07-2025 03:29:08 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): సీపీఐ దివంగత బాశెట్టి గంగారం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ, ఏఐటీయూసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సీపీఐ ఆఫీసులో శనివారం భాశెట్టి గంగారం 19 వ వర్ధంతిని నిర్వహించారు. సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ అధ్యక్షతన బాశెట్టి గంగారాం 19వ వర్ధంతి నిర్వహించారు. సిపిఐ పార్టీ జిల్లా ప్రతినిధి చిప్ప నరసయ్య, ఏఐటియూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ బాశెట్టి గంగారం చిత్రపటానికి కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిప్ప నరసయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కీలకమైన భూమిక గంగారం పోషించారన్నారు. గిరిజన ఆదివాసీ, గోండు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకానికి ఆరాధ్య దైవo విప్లవయోధుడు కొమరం భీమ్ ను పోలీసులకు పట్టిచ్చిన విప్లవ ద్రోహి మడావి కుద్దు ను ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం మేరకు గెరిల్లా దళం కమాండర్ గంగారం శిక్షించిందని పేర్కొన్నారు. బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ 1962 నుండి 1965 వరకు ఎమ్మెల్సీగా గంగారం విశేషమైన సేవలందించారని గుర్తు చేశారు.
బెల్లంపల్లి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా బెల్లంపల్లి ప్రజలకి ఎనలేని సేవ చేశారని తెలిపారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ మాట్లాడుతూ పోశెట్టి మరణాంతరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గంగారం ఘన విజయం సాధించి ఆసిఫాబాద్ ప్రెసిడెంట్ పదవి చేపట్టారన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా సింగరేణి కార్మికులకు అందించిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.