calender_icon.png 31 August, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం

31-08-2025 12:43:06 AM

-గ్రేటర్‌లో 68 ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

- క్షేత్రస్థాయిలో 101 ప్రత్యేక బృందాలు 

- నిరంతరం అప్రమత్తంగా ఉండాలి 

-సీఎండీ ముషారఫ్ ఫరూఖీ 

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న జరగనున్న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని విద్యుత్ పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సర్వం సిద్ధం చేసింది. భద్రతా ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు.

శనివారం గ్రేటర్ పరిధిలోని జోనల్ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెం డింగ్ ఇంజినీర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లను సమీక్షించారు.  సీఎండీ మాట్లాడుతూ, శోభాయాత్ర జరిగే మార్గాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, విద్యుత్ భద్రతపైనే ప్రధానంగా దృష్టి సారించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అధికారులు తమ పరిధిలో ఇప్పటికే చేపట్టిన పనులను సీఎండీకి వివరించారు.

పెద్ద విగ్రహాలు ఉన్న మండపాలు, శోభాయాత్ర సాగే మార్గాల్లో వదులుగా ఉన్న తీగ లను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్, అవసరమైన చోట ఇన్సులే షన్, ఇనుప స్తంభాలు, ఫ్యూజ్ బాక్సులకు పీవీసీ పైపులు, ప్లాస్టిక్ షీట్లు అమర్చడం వంటి అన్ని ముందుజాగ్రత్త చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. నిమజ్జనం ముగిసే వరకు సిబ్బంది షిఫ్టుల వారీగా నిరంతరం అందుబాటులో ఉండేలా డ్యూటీ చార్ట్‌ను సిద్ధం చేశామన్నారు.

కాగా నిమజ్జనం సందర్భంగా పెరిగే విద్యుత్ లోడ్‌ను తట్టుకునేం దుకు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్, లైన్స్, సీబీడీ విభాగాలకు చెందిన 101 సబ్ డివిజన్ స్థాయి బృందాలు నిరంతరం విధు ల్లో ఉంటాయి. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 68 ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. (మేడ్చల్ జోన్‌లో 31, రంగారెడ్డి జోన్‌లో 25, మెట్రో జోన్‌లో 12). అదనపు లోడ్ కోసం మొత్తం 104 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు.