calender_icon.png 27 September, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరి జనం కోసం సాహసం...

26-09-2025 10:09:36 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): ఒకవైపు భారీ వర్షం... చుట్టూ చెట్లు... నడి చెరువులో  తెగిపడిన విద్యుత్ వైర్లు.. అలాంటి చోటకు ఎవరైనా వెళ్తారా..? తెలిసి తెలిసి ప్రాణాలకు తెగిస్తారా... అది కూడా వర్షంలో అక్కడిదాకా వెళ్తారా..! కానీ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం విద్యుత్ సిబ్బంది ఆ సాహసానికి ఒడిగట్టారు..  ఊరు జనం కోసం... ఊళ్లో కరెంటు కోసం.. తమ ప్రాణాలకు తెగించి... విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన విద్యుత్ సిబ్బందికి గ్రామస్తులతోపాటు ట్రాన్స్ కో అధికారులు జై కొట్టారు. సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కల్లపల్లి గ్రామానికి రామగుండం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతున్న 11 కెవి విద్యుత్ లైన్ శుక్రవారం తెగిపోయి చెరువులో పడిపోయింది.

దాంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ఒక్క క్షణం ఆలోచించకుండా... తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పడవ సాయంతో చెరువులోకి వెళ్లి ఆ వర్షంలోనే తెగిపడిన విద్యుత్ తీగలను  అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం పైకి ఎక్కి పునరుద్ధరించారు. వీరి సాహసోపేతమైన చర్యను చూసి గ్రామస్తులు అభినందించారు. అంతా భారీ వర్షంలో చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ తీగలను సరి చేస్తున్న వీడియో అటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం సెల్యూట్ కొట్టారు.