27-01-2026 06:14:40 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జైనథ్ లో నూతనంగా నిర్మించిన బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ హై స్కూల్ & జూనియర్ కళాశాల ను జిల్లా కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. మంగళవారం DCC అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విద్యార్థులకు అందుతున్న వసతులు, భవన నిర్మాణ నాణ్యత, తరగతి గదులు, హాస్టల్ సదుపాయాలు, త్రాగునీరు, భోజన వసతి వంటి అంశాలను ఆయన పరిశీలించారు. డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ... విద్య అనేది సామాజిక అభివృద్ధికి పునాది అని, ముఖ్యంగా బీసీ వర్గాల విద్యార్థులకు ఇలాంటి రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఇలాంటి విద్యాసంస్థలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును మార్చే శక్తి కలిగివుంటాయి. అవసరమైన చోట మరింత సదుపాయాలు కల్పించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ గ్రామ సర్పంచ్ రజిత జగదీష్ రెడ్డి, TPCC మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్, తొడసం దౌలత్ రావు తదితరులు పాల్గొన్నారు.