calender_icon.png 21 May, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ

21-05-2025 01:01:04 AM

రూ.21వేల రికవరీ, పలువురికి షోకాజ్ నోటీసులు జారీ: డీఆర్డీవో శ్రీనివాసరావు

నార్సింగి(చేగుంట), మే 20 : నార్సింగి మండలం కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 4వ విడత సామాజిక తనిఖీ ఎంపిడిఓ ఆనంద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్ రావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.

మండల ప్రత్యేక అధికారి దామోదర్, డీవీఓ శ్రీహరి గౌడ్, జేక్యూసీఓ అరుణ, హెచ్‌ఆర్ రాజేందర్ రెడ్డి, ఎస్.ఆర్.పీ తిరుపతి తనిఖీలో పాల్గొన్నారు. తనిఖీ అనంతరం డీఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మండలంలోని మొత్తం 9 గ్రామ పంచాయితీలకు సంబంధించిన ఉపాధి హామీ పనులకు సంబంధించి లెక్కలు చూశామని, సంవత్సర కాలానికి రూ.3,75,47,382 పనులు జరిగాయని, అందులో కూలీలకు రూ.3,37,19657, కూలీలకు పోగా రూ.4,25,728 పనులకు సంబంధించిన వస్తువులకు ఖర్చు అయ్యిందని అన్నారు.

తనిఖీలో పలు విషయాలు దృష్టికి వచ్చాయని, ముఖ్యంగా కొన్నిచోట్ల జాబ్ కార్డులు డబుల్ వచ్చాయని వాటిని వెంటనే తీసివేయాలని సూచించారు. ఒకరి కార్డుపై వేరొకరు పనులు చేస్తున్నారని, అలా జరగకుండా చూడాలని, బినామీలను అరికట్టాలని అన్నారు. ఎంపిడిఓ, పంచాయితీ కార్యదర్శులు, ఎఫ్‌ఏ, టీఏ లు పని ప్రదేశాలను వారంలో కనీసం 3-4 సార్లు సందర్శించాలని, మస్టర్ రిజిష్టర్ లో సంతకాలు పరీక్షించాలని, మస్టర్ లో దిద్దుబాట్లు ఉండకుండా తగు జాగ్రత్తపడాలని సూచించారు.

ఉపాధి పనులు నిర్వహించే భాధ్యత గ్రామ పంచాయితీలదేనని, జీఓ 15 లో అందరి బాధ్యతలు వివరంగా ఉన్నాయని, దానిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అందరు 7 రకాల ఫైళ్లు సక్రమంగా నిర్వహించాలని, మండలంలో దాదాపు 80 శాతం చెట్ల పరిరక్షణ జరిగిందని, రాబోయేది వర్షా కాలం కాబట్టి ఎండిన చెట్ల వద్ద కొత్త చెట్లను నాటి వంద శాతం పూర్తి చేయాలని అన్నారు.

ఉపాధి హామీ రోజువారీ కూలీ రూ.307 ఉందని, మన జిల్లాలో సగటున 235 రూపాయిలే వస్తుందని, చేస్తున్న పనులను నిర్దేశించిన కొలతల ప్రకారం లోతు , ఎత్తు, పొడువు సరిగ్గా చేస్తే కూలీ పెరుగుతుందని, కూలి కనీసం రూ.300  రాబట్టుకోవాలని అన్నారు. పని ప్రదేశాల్లో నీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ కిట్ అమర్చే బాధ్యత గ్రామ పంచాయితీలదేనని, తప్పకుండా సమకూర్చాలని ఆజ్ఞాపించారు. కొన్నితప్పిదాల వల్ల రూ.21,913 రికవరీ, 20 వేలు జరిమానా  విధించడం జరిగిందని, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. మరో విడత సామాజిక తనిఖీ వరకు తప్పులను సరిదిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామ పంచాయితీల కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్ అసిస్టెంట్లుహాజరయ్యారు.