15-09-2025 09:39:07 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): విద్యార్థి దశ నుండే విత్తనాల సేకరణ కార్యక్రమం ద్వారా పర్యావరణంపై అవగాహన పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీ ఎస్) విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై చేపట్టిన సీడ్ బ్యాంక్ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించడం గర్వకారణం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులు సేకరించిన విత్తనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విత్తనాల సేకరణ అనేది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు పునాది అని, విత్తనాలను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వం అందించగలుగుతాం అని అన్నారు. ప్రతి విత్తనం ఒక జీవనాధారం, అది ఔషధ విలువలు, ఆహార భద్రత, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సీడ్ కలెక్షన్‌లో భాగంగా అత్యధికంగా 362 రకాల విత్తనాలు, 440 కిలోల విత్తనాలను సేకరించినందుకు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది చూపిన నిబద్ధత ప్రశంసనీయమని ఆయన తెలిపారు.
ఈ సందర్శన సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోనే ఒక నర్సరీని ఏర్పాటు చేసి, వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలో సీడ్ గిఫ్ట్ బాక్స్‌ను ఏర్పాటు చేసి, సమాజంలో విత్తనాల మార్పిడి, పంపిణీకి అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా స్థాయి సీడ్ బ్యాంక్ పోటీల్లో విజయం సాధించిన ఈ పాఠశాలకు ఇవ్వబోయే రూ.50,000/- నగదు బహుమతితో పాటు, అదనంగా జిల్లా స్థాయి నిధులు కేటాయించి విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీడ్ బ్యాంక్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం కాపాడటం, భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వం అందించడం లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.