08-07-2025 05:48:04 PM
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జునసాగర్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రం(Nagarjuna Sagar Tourism), బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ ను మంగళవారం నాడు ప్రపంచ దేశాలకు చెందిన పర్యావరణ ప్రతినిధులు సందర్శించారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఖండాలకు చెందిన స్విట్జర్లాండ్, భూటాన్, ఈజిప్టు, ఎతోపియా, కాంగో, ఫిజీ, గాంబియా, లైబేరియా, మయన్మార్ నేపాల్ నైజీరియా సౌత్ సుడాన్, టాంజినియా, యుగెండా, జింబాబ్వే మొదలగు 24 దేశాలకు చెందిన ప్రతినిధులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ(Environment Protection Training and Research Institute) ఆధ్వర్యంలో గత 14 రోజులుగా ప్రాజెక్టుల అభివృద్ధి- పర్యావరణం సామాజిక ప్రభావం- అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటన నిమిత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టును మంగళవారం ఈ బృందం సందర్శించింది. దీనిలో భాగంగానే నాగార్జునసాగర్ ప్రాజెక్టును, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు నాగార్జునసాగర్ డ్యాం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్ర వివరాలను ఈ బృందానికి తెలియజేశారు. వీరితో పాటు సాగర్ సిఐ శ్రీను నాయక్, ఎస్ పి ఎఫ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు నాయుడు, సాగర్ డ్యాం అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణయ్య, విజయపురి ఎస్సై ముత్తయ్య, ఎస్ పి ఎఫ్ ఎస్ ఐ రఘు తదితరులు పాల్గొన్నారు.