08-07-2025 10:17:06 PM
రాముని భూములకు రక్షణగా నిలిచిన ఆలయ ఈఓ రమాదేవిపై భూ ఆక్రమణ దారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రభుత్వ, ఆలయ భూములకు రక్షణగా విధులు నిర్వహించే అధికారులకు ప్రభుత్వం భద్రత కల్పించాలి
దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవాలి
తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం డిమాండ్
హైదరాబాద్: భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవి(EO Ramadevi)పై పురుషోత్తపట్నంకు చెందిన వారు చేసిన దాడిలో ఆమె స్పృహ తప్పి ఐసీయూలో చికిత్స పొందుతున్న వివరాలు తెలిసి తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అవేదన వ్యక్తం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు కె.చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తదుపరి ఈఓ వ్యక్తిగత సిబ్బందితో ఫోన్ ద్వారా యోగక్షేమాలు వాకబు చేశారు. ఐసీయూలో ఉన్న ఈఓ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోర్టు తీర్పు మేరకు భద్రాచలం రాముని భూములకు ఆలయ ఈవో రక్షణగా ఉన్నారని, చట్టాన్ని ఉల్లంఘించి ఆక్రమణలు చేస్తున్న వారిని అడ్డుకున్న రమాదేవిపై దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పురుషోత్తమ పట్నం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం పై దాడికి పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకొనేలా ఒత్తిడి తీసుకొని వచ్చి అధికారులకు మనో ధైర్యం కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ భూములకు,దేవాలయ భూములకు రక్షణగా ఉంటున్న అధికారులకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు.