08-07-2025 10:33:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణ మరమ్మత్తుల కోసం అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలలలో వివిధ మరమ్మత్తుల పనుల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో మరుగుదొడ్లు, పైకప్పులు (స్లాబ్), ప్రహరీ గోడలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన మరమ్మత్తులపై స్పష్టమైన అంచనాల నివేదికలను తక్షణం రూపొందించాలని ఆదేశించారు.
అత్యవసరంగా అవసరమైన పనులను మంజూరైన నిధులతోనే పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల కూల్చివేతను దశలవారీగా చేపడుతున్నట్టు తెలిపారు. భవిత కేంద్రాల్లో దివ్యంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, కేజీబీవీ సమన్వయకర్త సలోమి కరుణ, అధికారులు ప్రవీణ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.