08-07-2025 10:11:57 PM
పెద్దపులి సంచారం కలకలం..
కాసిపేట అడవుల్లో ఘటన..
భయాందోళలో గ్రామస్తులు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కాసిపేట మండలంలో పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. బెల్లంపల్లి అటవీ క్షేత్ర అధికారి సిహెచ్ పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం కాసిపేట మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దే రాజలింగుకి చెందిన లేగ దూడ పులి దాడిలో చనిపోయింది. ఈ సమాచారం తెలిసిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధిలో మల్కెపల్లి, వెంకటాపూర్ ఎంబీట్ల సరిహద్దుల్లో ఘటన ఫారెస్ట్ జరిగిందనీ అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చడంతో పెద్దపులి అడుగులు కుంట వద్ద లభించాయి. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
పెద్దపులి సంచరిస్తున్నందున వెంకటపూర్, లక్ష్మిపూర్, మల్కపల్లి, పెద్దగూడ సోనాపూర్ గ్రామ ప్రజలు పంట పొలాల్లోకి వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు సూచించారు. పశువుల కాపరులు అడవిలోకి వెళ్లకుండా, బయట మేపుకోవాలని,అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్దపులి సమాచారాన్నీ ముత్యంపల్లి డిప్యూటీ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లకు అందించాలని కోరారు. పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పులి దాడి ఘటనలో లేక దూడ మృతికి బాధిత రైతుకు నష్టపరిహారం కొరకు పై అధికారులకు నివేదికను పంపించినట్లు బెల్లంపల్లి అటవీ క్షేత్ర అధికారి సిహెచ్. పూర్ణచందర్ తెలిపారు. ఇక ఇప్పటినుంచి ఫారెస్ట్ అధికారులు పోలీసు సంచారంపై ఓ కన్నేసి పెడతారు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న కాసిపేట అటవీ ఆవరణలో పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ ఘటనతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. పులి సంచరిస్తున్న ప్రాంతం బెల్లంపల్లి బుగ్గ అడవులు కూడా సమీపంలోనే ఉన్నాయి. దీంతో సమీప గ్రామాలు వరిపేట, లక్ష్మీపూర్, కన్నాల గ్రామాల ప్రజలను పులి ఘటన భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఏ క్షణమైన పెద్దపులి పెద్ద బుగ్గ అడవులకు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.