08-07-2025 10:28:15 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదును ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(Facial recognition system) విధానంలో తప్పనిసరిగా చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. మంగళవారం హనుమకొండలోని బాసిత్ నగర్ ఉన్నత పాఠశాల, వడ్డేపల్లిలోని మండల రిసోర్స్ సెంటర్(ఎంఆర్సి), భవిత కేంద్రం (ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం) ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. బాసిత్ నగర్, వడ్డేపల్లిలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సి) లలో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థుల ముఖ గుర్తింపు నమోదు, పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం ల గురించిన వివరాలను ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న వంటగదిని కలెక్టర్ పరిశీలించారు.
మెనూ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరగతులను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్ కాంప్లెక్స్ ల వారిగా ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆ కేంద్రంలోని విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న భోజనం, ఆరోగ్యపరమైన విషయాలు, కేస్ డైరీ నమోదు గురించి కలెక్టర్ హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి నెహ్రూ, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాముల తనిఖీ.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు వేసి ఉన్న సీల్ లను, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.