09-09-2025 05:24:49 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా హైస్కూల్లో మంగళవారం తెలుగు సాహిత్య పితామహుడు కాళోజి జన్మదినాన్ని పురస్కరించుకొని కలం స్నేహం సాహితీ సంస్థ మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షురాలు హనుమాండ్ల రమాదేవి(District President Hanumandla Ramadevi) ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు లాస్య, సుశాంత్, వర్షిత,అనిరుద్ లతోపాటు మరి కొంతమంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలం స్నేహం సాహితీ సంస్థ గౌరవ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ, తెలంగాణ మాండలికానికి సాహిత్య గౌరవాన్ని కల్పించిన ఒక గొప్ప కవిగా కాళోజీ నారాయణరావు సాహిత్య పుటల్లో నిలిచిపోయారన్నారు.
ఆయన ప్రస్థానం తెలుగు సాహిత్యానికే మార్గ నిర్దేశమని అన్నారు. నైజాం వ్యతిరేక పోరాట ఉద్యమంలో క్రియాశీలకంగా నిలిచిన కాళోజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమాలను ఉరకలెత్తించారన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రతినిధిగా తన సాహిత్యానికి పదును పెట్టి ఉద్యమకారులకు దారి చూపారన్నారు. కాళోజి తెలుగు సాహిత్య, ఉద్యమ జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రఘుబాబు ,కలం స్నేహం సాహితీ సంస్థ అధ్యక్షురాలు కొత్తపల్లి సమత, సింధుజ, సునీత,తెలుగు ఉపాధ్యాయురాలు భబిత , ఉపాధ్యాయులు శంకర్ పాల్గొన్నారు.