09-09-2025 10:21:46 PM
సిఎం రిలిఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి పథకాలు పేదలకు వరం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
రూ.44.28లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేత.
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): పేదవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని, అందుకోసం పేదలకు, పల్లె ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై, ప్రతి పౌరుడిపై ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Sambasiva Rao) అన్నారు. కొత్తగూడెం క్లబ్బులో మంగళవారం జరిగిన సీఎం రిలిఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల లబ్దిదారులకు అందించిన అనంతరం అయన మాట్లాడుతూ సీఎం రిలిఫ్ ఫండ్ పథకం పేదలకు వరం లాంటిదని, ఐతే ఫండ్ మంజూరులో భారీ స్థాయిలో కోత విధించి తక్కువ మొత్తంలో మంజూరి చేయడం సరైంది కాదని, వైద్యం కోసం ఖర్చు చేసిన మొత్తంలో కనీసం 75 శాతం బిల్లు ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పిల్లలకు పెళ్లిల్లు చేయలేని పేదలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం భరోసాగా నిలుస్తుందని, ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా తులం బంగారం పథకాన్ని సత్వరమే అమ్మలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారందరికి అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, జిల్లా సమితి సభ్యులు దీటి లక్ష్మీపతి, దారా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.