09-09-2025 05:15:41 PM
చిట్యాల (విజయక్రాంతి): అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎస్సై జీ.శ్రావణ్ కుమార్(SI Shravan Kumar) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామానికి చెందిన క్రీ.శే.సకినాల కుమారస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా మృతుడి జన్మదినాన్ని పురస్కరించుకొని కైలాపూర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సహకారంతో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్సై హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా రక్తదాతగా నిలిచి యువకులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రక్తదానం ఓ జీవితాన్ని కాపాడే పుణ్య కార్యం అన్నారు.
రక్తం లేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదాన శిబిరాలు ఒక వరం లాంటివన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలుగా నిలిచిన 30 యువకులు, పోలీస్ కానిస్టేబుళ్లను, ఇంత మంచి రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఆహ్వాన మేరకు రక్తదాన శిబిరంలో భాగస్వాములైన ప్రతి ఒక్క మిత్రునికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, నాయకులు పువ్వాటి వెంకన్న,కైలాపుర్ మాజీ సర్పంచ్ చింతల శ్వేత సుమన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అక్షయ్,స్టాఫ్ నర్స్ సౌజన్య,రాజ్ కుమార్,ఆకాష్,ల్యాబ్ టెక్నీషియన్స్ శ్రీకాంత్,సంధ్య,సంతోష్, రాజేందర్,నిర్వాహకులు చింతల మహేందర్, సకినాల రాకేష్, వేముల రాజు, వేముల హరీష్, బోయినీ అజయ్, బుద్ధారపు రవీందర్,చింతల తిరుపతి, సకినాల కిరణ్, ప్రభాకర్ తదితర మిత్ర బృందం పాల్గొన్నారు.