16-12-2025 02:06:57 AM
వార్డు సభ్యుడిగా నిన్న గెలుపు.. నేడు గుండె పోటు
నాగర్ కర్నూల్ జిల్లా కోటాల్ గడ్డలో ఘటన
నాగర్ కర్నూల్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వార్డు సభ్యుడు గుండెపోటుతో ఆకస్మిక మరణం ఆ గ్రామాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కోటాల్ గడ్డ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన 7వ వార్డు సభ్యుడు మల్లేష్ 11 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
గెలిచిన ఆనందం తీరకముందే అదే రోజు రాత్రి గ్రామస్తులతో రాత్రి వరకు సంతోషంగా గడిపి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున ఎంతకూ నిద్ర లేవకపోవడంతో గమనించిన తన సోదరుడు లేపేందుకు ప్రయత్నించగా విగతాజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. గత కొద్దిరోజుల క్రితం తన తండ్రి గుండె ఆపరేషన్ జరిగి డిశ్చార్జ్ చేసేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.