calender_icon.png 18 December, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజులు ఎంత సారూ?

18-12-2025 01:45:59 AM

  1. ఇంకా విడుదలకాని ఇంజినీరింగ్ ఫీజుల జీవో 
  2. మొదటి సెమిస్టర్ కావొస్తున్నా.. పాత ఫీజులే!

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. 2025-27 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజుల జీవోను ప్రభుత్వం విడుదల చేయాల్సిఉంటుంది. అయితే ఆ జీవో ఇంకా విడుదల కాలేదు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తెలంగాణ అడ్మిషన్స్ అండ్  ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్‌ను సమర్పించింది.

ప్రభుత్వం ఈ ఫీజులకు ఆమోదం తెలపాల్సి ఉం టుంది. ఆ తర్వాతే జీవోను విడుదల చేస్తారు. ఈ జీవో విడుదలైతేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. 2025- 26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మొదటి సెమిస్టర్ కూడా కావొస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఫీజుల అంశాన్ని కొలిక్కి తీసుకురాలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

ఇప్పటికే ఫీజులు ఖరారు..!

వాస్తవంగా ఏ కాలేజీకు ఎంత ఫీజు ఉండాలో ఇప్పటికే ఫైనల్ చేశారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆమోదం లభించాలి. కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో విడుదల విషయంలో ఆలస్యం జరిగింది. అప్పట్లో జీవో విడుదలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల అధికారులను విద్యాశాఖ అధికారులు కోరినట్లు తెలిసింది. అనుమతి వచ్చిన వెంటనే జీవోను ప్రభుత్వం విడుదల చేస్తుందని కాలేజీల యాజమాన్యాలు భావించాయి.

కానీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఆ తర్వాతైనా ఓ నిర్ణయం తీసుకుంటుందని అనుకునేలోపే గ్రామపంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీనికితోడూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సెలవుల్లో ఉండడం కూడా ఫీజుల నిర్ణయానికి ఆలస్యంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆమె సెలవులు ముగిసి తిరిగి వచ్చారు. 

ఈ ఏడాది అమలయ్యేనా..?!

ఇంజినీరింగ్ ఫీజుల నిర్ధారణకు ఇంజినీరింగ్ కాలేజీల హియరింగ్ (విచారణ) ప్రక్రియ అక్టోబర్ నెలలోనే ముగిసింది. ఫీజుల నిర్ధారణకు సంబంధించి రాష్ట్రంలోని 160 ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలను టీఏఎఫ్‌ఆర్‌సీ విచారించింది. తొలుత ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ హియరింగ్‌ను చేపట్టింది. అ యితే టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన ఫీజులు కొన్ని కాలేజీలకు అనుకూలంగా ఉన్నాయ ని, ఎలాంటి విద్యాప్రమాణాలు పాటించని కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచేశారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోసారి ఫీజులను ఖరారు చేయాలని అప్పట్లో ఆదేశించింది. ప్రభుత్వ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించింది. తొలిసారి విచారించినప్పుడు కాలే జీలు సమర్పించిన రిపోర్టులు సరైనవేనా?, ఒకవేళ ఇచ్చిన నివేదికల్లో ఏమైనా తప్పుడు లెక్కలు, సమాచారం ఉంటే కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేలా కాలేజీల నుంచి అఫిడవిట్లను సైతం తీసుకుంది. కాలేజీల్లో ఎలాంటి వసతులున్నాయి, ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, భవనాలు తదితర వివరాలను పరిగణలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

అయి నా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో అసలు ఈ ఏడాది కొత్త ఫీజులు అమలవుతాయా? లేదా? అన్న సందేహాలు కాలేజీల యాజమాన్యాల్లో కలుగుతున్నా యి. ఫీజుల అంశం కొలిక్కి రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం పాత ఫీజులనే అమలు చేస్తున్నారు. ఒక వేళ ఫీజులు పెరిగితే ఇప్పుడు కట్టిన ఫీజు పోను మిగతా మొ త్తాన్ని కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది.

కానీ గత బ్లాక్ పీరియడ్‌తో పోలిస్తే ఈ బ్లాక్ పీరియడ్‌కు ఎంతో కొంత ఫీజులను పెంచే అవకాశమే ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఫీజులు పెరిగితే ప్రభుత్వంపై భారం పడుతుందని, అందుకే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతున్నట్లుగా పలు కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.