calender_icon.png 18 December, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లు ఫిరాయించలె!

18-12-2025 01:51:44 AM

ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు డిస్మిస్

  1. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు 
  2. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే..
  3. స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక తీర్పు
  4. నేడు పోచారం, కాలే యాదయ్య, సంజయ్‌కుమార్ పిటిషన్లపై తీర్పు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ బుధవారం తీర్పు వెలువరిం చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల ను విచారించిన స్పీకర్ కీలకమైన తీర్పు ను వెలువరించారు. దీంతో ఈ అం శంపై ఉత్కంఠకు తెరపడింది. బీఆర్‌ఎస్‌కు చెందిన తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం),  బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వా ల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) పార్టీ మారినట్లు దాఖలైన అనర్హత పిటిషన్ల ను స్పీకర్ కొట్టివేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారా లు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు.

అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ‘మేం నియోజకవర్గాల అభి వృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశాం. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోలేదు.. ఆ పార్టీలో చేరలేదు. మాకు ప్రతి నెలా వచ్చే వేతనాల నుంచి కట్ అయిన డబ్బులు బీఆర్‌ఎస్‌ఎల్పీ ఖాతాలోనే జమ అవుతున్నాయి.

కనుక మేం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నాం. మాకు అనర్హత పిటిషన్ వర్తించదు’ అని పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల ఎమ్మెల్యేల వాదనలు విన్న స్పీకర్.. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని, వారు అనర్హత వేటుకు అర్హులు కాదని తీర్పు ఇచ్చారు. 

 బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ పిటిషన్లు దాఖలు చేయగా.. ఎనిమిది మందికి సంబంధించి విచారణను స్పీకర్ పూర్తిచేశారు. ఇక గురువారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్‌కుమార్‌కు సంబంధించిన తీర్పు వెలువడనుంది.

మరోవైపు, దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్)పై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ పూర్తికాలేదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విచారణకు మరింత సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. అయితే అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ గతంలోనే సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో అనర్హత  పిటిషన్‌పై విచారణ అనంతరం ఈనెల 19 తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు సూచనల మేరకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు  సంబంధించి అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు. వారు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు సంబంధించి తీర్పు ఇచ్చారు. 

దానం, కడియం తీర్పుపైన ఉత్కంఠ.. 

విచారణకు హాజరుకాని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటార నేది ఉత్కంఠంగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి   ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు.. గత పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడి యం కావ్య వరంగల్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించన సభల్లోనూ పాల్గొన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు, ఆ పార్టీ సభల్లోను పాల్గొన్నట్లుగా పూర్తి ఆధారాలున్నాయని, వారిపై కచ్చితంగా వేటు పడుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ ఇద్దరి విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా స్పీకర్ ముందు పూర్తి ఆధారాలు పెట్టినట్లుగా చెబుతున్నారు. దీంతో కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొన్నది.