calender_icon.png 18 December, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 గంటల్లో డివిజన్ల జనాభా.. మ్యాపుల వివరాలివ్వాలి!

18-12-2025 01:07:35 AM

  1. తక్షణం పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి
  2. అభ్యంతరాలకు 48 గంటల గడువు
  3. అంతకు మించి గడువు ఇవ్వలేం: హైకోర్టు
  4. జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ అశాస్త్రీయత అనే పిటిషన్‌పై విచారణ 
  5. డివిజన్ల పునర్విభజనపై తీర్పు రిజర్వ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల పు నర్విభజన, విలీన ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం తెలంగాణ హై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, అధికారులు అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. పిటిషనర్లకు ఊరటనిచ్చేలా కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  

లంగర్‌హౌస్, శాలిబండ తదితర డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆసక్తికర వాద నలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు డివిజన్ల పునర్విభజనను అత్యంత హడావిడిగా, గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తు న్నారని పిటిషనర్ల తరఫు న్యాయవా దులు వాదించారు. చట్టం ప్రకారం ఒక డివిజన్‌కు మరో డివిజన్‌కు మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించి ఉండకూడదని, కానీ ప్రస్తుత ప్రతిపాదనల్లో భౌగోళిక పరిస్థితులను గానీ, జనాభా నిష్పత్తిని గానీ పరిగ ణనలోకి తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చా రు.

అసలు ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో తెలిపే మ్యాపులను, డేటాను ‘పబ్లిక్ డొమైన్’లో పెట్టలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని వాదించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ ఏజీ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే డివిజన్ల పరిధిని పెంచామని, విలీనం చేశామని వివరించారు. పాలనాపరమైన కారణాల వల్లనే మ్యాప్‌లను బహిరంగపర్చలేదని, అయితే కార్పొరేటర్లకు మాత్రం సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 3 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని కోర్టుకు వివరించారు.

 ఏజీ వాదనపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ..  సమాచారం, మ్యాపులు ఇవ్వకుండా పిటిషనర్లు అభ్యంతరాలు ఎలా వ్యక్తం చేస్తారు.. అని ప్రశ్నించారు. తక్షణమే పిటిషనర్లకు డివిజన్ల వారీగా జనాభా వివరాలు, అధికారిక మ్యాపులను 24 గంట ల్లోగా అందజేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. ఆ వివరాలు బాధితులకు అం దాక, అభ్యంతరాలు తెలిపేందుకు వారికి రెండు రోజుల గడువు ఇవ్వాలని స్పష్టం చేశారు.

కౌన్సిల్ భేటీలో గందరగోళం 

మంగళవారం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. డీలిమిటేషన్ పునర్విభజన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపె ట్టగా.. సభ్యులు దానిపై భగ్గుమన్నారు.  అభ్యంతరాల స్వీకరణకు  డిసెంబర్ 17 చివరి తేదీగా నిర్ణయించడం సరికాదని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు.  

కమిషనర్‌తో ఎమ్మెల్యేల భేటీ

డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్పొ రేటర్లు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిశారు. వారు వినతిపత్రం అందజేస్తూ..స్థానిక ప్రజాప్రతినిధులైన తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.సరిహద్దుల మార్కింగ్ ఏ ప్రాతి పదికన చేశారో చెప్పాలి.కేవలం అధికారుల ఇష్టారాజ్యంగా కాకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను బట్టి విభజన ఉండాలి అని డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో.. తుది తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.