08-09-2025 06:57:30 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పై కొంతమంది విష ప్రచారం చేయడం సరైనది కాదనీ, దీన్ని ఖండిస్తున్నామని కరీంనగర్ దళిత సంఘాల నాయకులు మాజీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. రాజేందర్రావుపై పత్రికల్లో సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఖబర్దార్ అని హెచ్చరించారు. కొంతమంది కుట్రదారులు వెలిచాల అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిసిసి అధ్యక్షుడి ఫోటో లేదంటూ హైడ్రామా చేస్తూ దళితులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కొంతమంది వెలిచాల రాజేందర్ రావుపై చేసిన ఆరోపణలను దళిత సంఘాల నాయకులు సోమవారం కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో మాజీ కార్పొరేటర్లు లతో కలసి విలేకరుల సమావేశంల ఖండించారు.
ఇవీ పూర్తిగా అర్ధరహితమైన ఆరోపణలు అనీ, కొంతమంది రాజేందర్రావు అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అందులో ప్రోటోకాల్ పాటించాలని నానా యాగి చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని వినాయక నవరాత్రి ఉత్సవాల వేల అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డిసిసి అధ్యక్షుడి.. ఫోటో పిసిసి అధ్యక్షుడు ఫోటో లేదు అంటూ నిరసనలకు దిగడం దళితులను కించపరుస్తున్నారని అవహేళనగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దళితుల పేరిట రాజకీయ పబ్బం గడుపుకునేవారు విద్వేషాలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వెలిచాల రాజేందర్ రావు దళితుల పక్షపాతి అనీ, వారింటికి నిత్యం దళితులు ఎంతోమంది వెళ్తుంటారని వారితో సమానంగా భోజనానికి పిలిచి తింటారని అలాంటి నేతపై సోషల్ మీడియాలో పత్రికల్లో ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడం దారుణమన్నారు.
రాజేంద్ర రావు పై ప్లెక్సీ పేరిట లేనిపోని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజేందర్ రావు పై ఈగ వాలినా తేనెటీగలుగా మారుతామని దాడులకు దిగేందుకు వెనుకాడమని ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా కూతలు కూస్తే ఇకపై సహించేది లేదనీ, వెయ్యి డప్పులు కాదు లక్ష దప్పులతో కుట్ర దారుల సంగతి తేలుస్తామని స్పష్టం చేశారు. ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని, ఫ్లెక్సీ అంశానికి ఇకనైనా పుల్ స్టాప్ పెట్టాలని దళిత సంఘాల నాయకులు సూచించారు. అభిమానులు చేసిన తప్పిదం వల్ల ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేకపోయారని దానికి రాజేందర్ రావు స్పందించి వివరణ ఇచ్చారని తెలిపారు. అయినా కూడా వినకుండా రాద్ధాంతం చేయడం తగదని ఈ విషయంలో పట్టు విడుపులకు పోవద్దని సూచించారు. నాడు దళితుల పక్షపాతిగా నిలిచిన ఏకైక నేత జగపతిరావు అని గుర్తు చేశారు.
అలాంటి నేత కుమారుడు రాజేందర్ రావు స్వచ్ఛమైన నీతిమంతమైన గుణం కలిగిన రాజేందర్ రావు పై పిచ్చిపిచ్చి కూతలు కొందరు కూయడం సరైనది కాదని మళ్లీ దళితులపైనే తిరిగి విమర్శలు చేయడం వారికి కనీసం జ్ఞానం కూడా లేదని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కొంతమంది ట్రాప్ లో పడిపోయి వాస్తవాలను నమ్మడం లేదనీ, ఇకనైనా వాస్తవాలను గమనించాలని వారు సూచించారు. కొంతమంది చెంచా గాళ్ల చెప్పుడు మాటలు విని కవ్వంపల్లి సత్యనారాయణ మోసపోవద్దని, అసలు విషయాలు తెలుసుకొని మసులుకోవాలని సూచించారు. రాజేందర్ రావు పై కొంతమంది విషయం చిమ్ముతూ పోస్టులు పెడుతున్నారని ప్రజలంతా వారిని గమనిస్తున్నారని ఎవరేమిటో ప్రజలకు తెలుసు అని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే ఫ్లెక్సీ పేరిట నాటకమాడుతూ లేనిపోని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు