calender_icon.png 28 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా కష్టపడి పనిచేయాలి

27-11-2025 12:00:00 AM

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

బాన్సువాడ, నవంబర్ 26 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బారాస పార్టీ కి అన్ని స్థానాలు కైవసం చేసుకొనేలా ప్రతి ఒక్క బారాస కార్యకర్త సైనికుడిలా కష్టపడి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సన్నాహక కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు జులుం చలాయిస్తున్నారని, గులాబీ పార్టీ శ్రేణులపై అక్రమ  కేసులు పెట్టి  ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో గులాబీ శ్రేణులు ఎదురొడ్డి నిలవాలని, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడే నిలదీయాలని సూచించారు. ప్రతి ఒక్క బిఆర్‌ఎస్ కార్యకర్తకు అండగా ఉంటానని ఎవరు అధైర్య పడవద్దు అని ఆయన సూచించారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ కి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులకు దీటైన  వ్యక్తులనే బరిలోకి దించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

వారి విజయానికి తగిన విధంగా కృషి చేయాలి అన్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా గట్టి పోటీనివాలన్నారు. తానే స్వయంగా సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని చెప్పారు.  అభ్యర్థుల ఖరారు విషయంలో సమీక్షలు సమాలోచనలు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక కార్యచరణ ప్రణాళికతో ముందుకు పోవాలని పేర్కొన్నారు. గ్రామాల నాయకులు, కార్యకర్తలు మండల స్థాయి బాన్సువాడ కేంద్ర స్థాయి నాయకులతో కలుస్తూ పంచాయతీలలో పట్టు సాధించేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మాజీ రైతు బందు అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, గణేష్, సాయిబాబా చందర్ సాయిలు వేణు తదితరులు ఉన్నారు.