27-11-2025 12:00:00 AM
ఎల్బీనగర్‌లో బీసీ సంఘాల నాయకుల ఆందోళన
ఎల్బీనగర్, నవంబర్ 26 : భారత రాజ్యాంగం ఉద్దేశించిన సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని పలువురు బీసీ ఉద్యమ నేతలు హెచ్చరించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు పలువురు బీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం ఎల్బీనగర్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ ప్రతులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, దురుద్ధేశపూర్వకంగా రిజర్వేషన్లను తక్కువ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు 23 శాతం అమలు చేస్తూ తీసుకుని వచ్చిన 46 వ జీవో ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎల్బీనగర్ బీసీ జేఏసీ అధ్యక్షుడు దుస్స యాదగిరి నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేతలు బొమ్మ రఘురామ్ నేత, చామకూర రాజు, ఎర్ర మాద వెంకన్న, కేవీ గౌడ్, విశ్వనాథుల పుష్పగిరి, ఉపేంద్ర యాదవ్, బొల్లంపల్లి ఆంజనేయులు, తడ్క యాదగిరి, కొండల్ గౌడ్, సింగారం శ్రీనివాస్, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.