12-05-2025 02:51:40 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): కాళేశ్వరం త్రివేణి పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈనెల 15నుంచి 26వరకు జరిగే పుష్కరాల్లో ప్రతీరోజు సరస్వతీ హోమం, రుద్రహోమం, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు.
ప్రముఖ పీఠాధిపతుల సమక్షంలో జరగబోయే ఈ చారిత్రిక మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి ఆదివారం సామాజిక, ప్రసార మాధ్యమాలకు ఇచ్చిన సందేశంలో పిలుపునిచ్చారు. ప్రతీ పన్నెండెళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కర మహో త్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో భక్తి శ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తోందని ఆమె తెలిపారు.
త్రివేణి సంగమంలో పుణ్యస్నానానికి, ఆధ్యాత్మిక ఆరాధనలకు వచ్చే లక్షలాది భక్తులకు తమ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భారీస్థాయిలో అన్ని వసతులను ఏర్పాటు చేసిందని మంత్రి సురేఖ చెప్పారు.