20-09-2025 12:00:00 AM
బూర్గంపాడు, సెప్టెంబర్19 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యంతో ముడి పడి ఉన్న పారిశుధ్య చర్యలు గ్రామాల్లో పూర్తిగా పడకేశాయి. గ్రామాల్లో చూసినా చెత్తకుప్పలు,మురికి కుంటలే దర్శనమిస్తున్నాయి. చెత్తను ఎప్పటికప్పుడు తొలిగించేందుకు ప్రత్యేకంగా కార్మికులను ఏర్పాటుచేసినా ఫలితం దక్కడంలేదు.
పారిశుధ్య చర్యలు కరువు..
బూర్గంపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలంలో సుమారు 50వేలకు పైగా జనాభా ఉంది. ప్రతీ పంచాయతీల్లో మురుగు కాలువల్లో పూడిక,చెత్తను తొలగించడానికి పారిశుధ్య కార్మికులు ఉన్నారు. కార్మికులకు ప్రతీనెల వేతనాలు, ట్రాక్టర్ల మెయింటెనెన్స్ కు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిధులు ఖర్చు అవుతున్నా పనులు మాత్రం సక్రమంగా చేపట్టడం లేదన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి.
రోడ్లపైనే మురుగు నీరు..
మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. రోడ్డు వెంట ఉన్న డ్రైనేజీలు మురుగునీటితో దర్శనమిస్తున్నాయి. నెలకు ఒకసారైన మురుగు కాలువల్లోని చెత్త, పూడికను తొలగించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామాల్లో మురుగు నీరు జనావాసాల మధ్య నిల్వ ఉంటుంది.
దీంతో ఇళ్లలోకి దుర్వాసన వెదజల్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేయించకపోతే సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు గ్రామాల్లో టైఫాయిడ్,మలేరియా,వైరల్ ఫీవర్ డెంగ్యూ బారినపడి పలువురు ఆసుపత్రుల పాలయ్యారు.
పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం..
గ్రామాల్లో పారిశుధ్య సమస్యను అధికారులు తేలికగా తీసుకోవడంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు నిర్మించిన వర్షపు నీరు మురికి కాలువలోకి పోకుండా కొందరు తమ ఇంటి సమీపంలో మురుగు కాలువ కన్నా ఎత్తు మట్టి వేయడంతో వర్షపు నీరు మురుగు కాలువలోకి వెళ్లకుండా రోడ్లపైనే పారుతోంది. వర్షం నీరు రోడ్డుపై గుంతల్లో నిలిచి దోమల వృద్దికి కారణం అవుతున్నాయి. ప్రతీ గ్రామంలో ఇదే సమస్య ఉన్నా పంచాయతీ అధికారులు డ్రైనేజీల నిర్వహణ తీరుపై దృష్టి సారించడం లేదు.