20-09-2025 12:00:00 AM
న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఆదేశం
చేగుంట, సెప్టెంబర్ 19 : దళిత మహిళ ఆత్మహత్యకు కారకులైన పంచాయతి కార్యదర్శి స్రవంతిని వెంటనే సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం వెంటనే అం దించాలని మెదక్ కలెక్టర్‌ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ పంచాయతి కార్యదర్శి స్రవంతి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న దళిత మహిళ కొండి లక్ష్మీ కుటుంబాన్ని శుక్రవారం చైర్మన్ బక్కివెంకటయ్య పరామర్శించారు.
లక్ష్మి ఆత్మహత్యకు కారణాలను ఆమె భర్త అంజయ్య, కుటుంబ సభ్యులను, గ్రామస్తులను, పొలీస్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురికి కాలువను శుభ్రం చేయాలన్న పాపానికి పంచాయతి కార్యదర్శి స్రవంతి కులం పేరుతో దూషించి, దాడి చేసి, కాళ్ళు మొక్కించుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తన బార్య లక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని, మాకు న్యాయం చేయాలని రోధిస్తూ భర్త అంజయ్య కోరారు.
అధికారుల హమీ ప్రకారం బాధిత కుటుంబానికి భూ పంపిణి చేయాలని, లక్ష్మీ కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్పందించిన చైర్మన్ బక్కివెంకటయ్య వెంటనే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి దళిత మహిళ లక్ష్మీ ఆత్మహత్య కు కారకురాలైన పంచాయతి కార్యదర్శి స్రవంతిని సస్పెండ్ చేసి, నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ఆదేశించారు.
అదే విధంగా బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం మొదటి విడత 4.50 లక్షలను అందజేయాలని, భూ పంపిణీ చేయాలని, ఉద్యోగం ఇవ్వాలని అదేశించారు.
ప్రభుత్వ భూమిని పరిశీలించి వేంటనే పట్టా సర్టిఫికేట్ ఇచ్చి భూమిని అందజేయాలని తహసీల్దారు శ్రీకాంత్ ను చైర్మన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, దళిత నాయకులు సామాల అశోక్, కొండి స్వామి, రామాయంపేట సిఐ, చేగుంట ఎస్.ఐ, ఎంపిడిఓ , ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.