calender_icon.png 8 October, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకయ్య నాయుడు ప్రశంస మర్చిపోలేనిది: ‘అరి’ చిత్ర డైరెక్టర్

08-10-2025 06:25:57 PM

వినోద్‌ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘అరి’. దీనికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన జయశంకర్ వంగ ఈ సినిమాను అరిషడ్వర్గాలు ఇతివృత్తంగా తెరకెక్కించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రామిరెడ్డి వేంకటేశ్వరరెడ్డి (ఆర్‌వీరెడ్డి) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ రామిరెడ్డి, డీ శేషురెడ్డి మారంరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఏషియన్ సురేశ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ జయశంకర్ విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు. నాకు చిన్నప్పట్నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురాణాల్లో అరిషడ్వర్గాలను జయించాలని చెప్పారే తప్ప, ఎలా జయించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. నేను ఆ విషయాన్నే చెప్పదలుచుకున్నాను. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. 

అరిషడ్వర్గాలను జయించే మార్గాల గురించి సమాచారం కోసం హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిశాను. వారు ఇచ్చిన సలహాలు, సూచనలు నా ప్రాజెక్టుకు కొంతవరకు ఉపయోగపడ్డాయి. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో నేను సఫలమయ్యానని అనుకుంటున్నాను. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.

ఈ సినిమాను తొలుత స్టార్స్‌తో చేద్దామనుకున్నాను. కానీ, పాత్రల కంటే వారి స్టార్‌డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని ఆ ఆలోచన విరమించుకున్నాను. పాత్రలకు సరిపోయేలా సాయికుమార్, అనసూయ, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్‌లను తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన వాళ్లందరూ పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి. అందరూ పాత్రలు మాత్రమే కనిపించేలా హావభావాలు పలికించడం వల్లే ఇది సాధ్యమైంది. 

తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారనేదే ‘అరి’ సినిమా నేపథ్యం. అరిషడ్వర్గాల సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యేలా తెరపై చెప్పే ప్రయత్నం చేశాను. మల్లాది, యండమూరి లాంటి రచయితలు ఈ సినిమా చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు.. పురాణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు.. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నా. 

ఏ సినిమా కూడా ప్రేక్షకులందరికీ యునానమస్‌గా నచ్చదు. మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంత మంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలనుకుంటున్నాం. 

ఈ మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్‌కు వెళ్తున్నాం.