15-09-2025 12:00:00 AM
మేడ్చల్, సెప్టెంబర్ 14(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూలుతున్నారు. తమకు డబ్బులు వస్తే చాలు అని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు, జీవితాల మీదకు వస్తోంది. జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన సంఘటనలు వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంత నష్టం జరిగినా అధికారుల్లో చలనం కలగడం లేదు.
దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం లేదు. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్లపల్లి లోని వాగ్దేవి లాబరేటరీ లో డ్రగ్స్ తయారీ బయటపడిన సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోంది.
తాజాగా బోయిన్పల్లి లో ఒక ప్రైవేటు పాఠశాలలో తయారీ బయటపడడం కలకలం సృష్టించింది. పాఠశాల నడుస్తుండగా అందులోనే రియాక్టర్లు పెట్టి ఆల్ఫ్రోలం తయారు చేస్తున్నారు. కొన్నేళ్లుగా తయారు చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు గుర్తించలేదు. ఇక్కడ తయారైన ఆల్ఫ్రా జోలం మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో విక్రయించారు.
అన్ని కేసులు మేడ్చల్ జిల్లాలోని....
ఇటీవల వెలుగు చూసిన కేసులన్నీ మేడ్చల్ జిల్లాలోని జరగడం గమనార్హం. జిల్లా పరిధిలో రెండు ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రెండింటి పరిధిలో కూడా అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం మత్తు పదార్థాలు తయారు చేసే వారికి, విక్రయించే వారికి కలిసి వస్తోంది. జిల్లాలో ఇటీవల మేజర్ కేసులన్నీ ఈగల్, మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నవే.
బోయినపల్లి లో ఆల్ఫ్రజూలం తయారీని ఈగల్ పట్టుకుంది. చర్లపల్లి లో వాగ్దేవి లాబరేటరీ లో డ్రగ్స్ తయారీ మహారాష్ట్ర పోలీసులు నిఘా వేసి పట్టుకోవడం మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎక్సైజ్ అధికారుల పనితీరును బహిర్గతం చేసింది. అల్వాల్ లో కాలేజీ విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒక మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాగే బహదూర్ పల్లి శివారులోని మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
కూకట్పల్లిలో కల్తీకల్లుతో 14 మంది మృతి
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 14 మంది మరణించారు. ఆ సమయంలో ఎక్సైజ్ అధికారులు కొంత హడావుడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాలు తనిఖీ చేస్తామని ప్రకటించారు. జిల్లాలో అక్కడక్కడ కొన్ని దుకాణాలు మాత్రమే తనిఖీ చేసి వదిలేశారు. ప్రస్తుతం మళ్లీ కల్తీకలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
గల్లీకో బెల్టు షాప్, కల్లు దుకాణం
జిల్లాలో గల్లీకో బెల్టు షాపు ఉంది. ఎక్సైజ్ అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పరిమిట్ రూములు నిర్వహిస్తున్నారు. కల్లు దుకాణాలు అనుమతి లేకుండా నడుస్తున్నాయి. మేడ్చల్ లో ఎనిమిదింటికి మాత్రమే అనుమతి ఉండగా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం విడాలని, మత్తు పదార్థాల తయారీ, విక్రయాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.