calender_icon.png 15 September, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనింగ్‌లో మహిళాసాధికారత దిశగా చర్యలు

15-09-2025 12:00:00 AM

-ఓసీ గనుల్లో మహిళా ఆపరేటర్ల నియామకం

-ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

-జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం

--సింగరేణి చరిత్రలో తొలిసారి

మంచిర్యాల, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : సింగరేణి కోల్ కెమికల్ కంపనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) సంస్థ మహిళా సాధికారత దిశగా చర్యలు తీసుకుంటుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి.

మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సీఎండీ బలరామ్ నాయక్ ఆదేశాల మేరకు ఈ నెల 13న సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్టు మెంటులకు సర్క్యూలర్ జారీ చేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ గా, బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దర ఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

సింగరేణిలో మహిళలు...

సింగరేణి సంస్థలో పరిపాలన (ఆఫీస్ సిబ్బంది, క్లర్కులు, సూపరింటెండెంట్లు, పర్సనల్ మేనేజ్ మెంట్, హెచ్‌ఆర్), విద్య (సింగరేణి పాఠశాలల్లో ఉపాధ్యాయులు, శిక్షణా కేంద్రాలు), వైద్యం (డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, హెల్త్ అసిస్టెంట్లు), టెక్నికల్ (మైనింగ్ ఇంజనీర్లు, ఐటీ, ఎలక్ట్రికల్, మెకానికల్), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ (క్యాషియర్లు, అకౌంటెంట్లు, ఆడిట్),  భద్రత అం డ్ వెల్ఫేర్ విభాగాలలో ప్రస్తుతం కొంత మంది పని చేస్తున్నారు. ఇటీవలనే పురుషులతో సమానంలో మహిళలకు సైతం రెస్క్యూ విభాగంలో కఠిన శిక్షణ ఇప్పించి సిద్ధం చేసిన సింగరేణి మరో అడుగు ముం దుకేసి ఓసీల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం కల్పించింది.

దరఖాస్తులకు అవకాశం.. -

శ్రీరాంపూర్ ఏరియాలో వివిధ విభా గాలలో మహిళలు 150 మందికిపైగానే ఉన్నా జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్‌లుగా వంద మంది వరకు పని చేస్తున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు యాజమాన్యం అవకాశం కల్పించింది. అర్హులైన మహిళా ఉద్యోగులు సంస్థ విడుదల చేసిన నమూనా అప్లికేషన్లు పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్ కు లేదా డిపార్టుమెంటు హెడ్ కి లేదా ఏరియా జనరల్ మేనేజర్ కు అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హతలు గల అభ్యర్థులను కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ అవకాశాన్ని అర్హులైన మహిళ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి.

 మునిగంటి శ్రీనివాస్, జనరల్ మేనేజర్, శ్రీరాంపూర్ ఏరియా

అర్హతలు ఇవే..

సింగరేణి సంస్థలో జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్ లుగా పని చేస్తున్న మహిళా అభ్యర్థుల వయస్సు 35 ఏండ్ల లోపు ఉండి, వారు కనీసం ఏడవ తరగతి పాసై ఉంటేనే ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు యాజమాన్యం అవకా శం కల్పించింది. దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యంతో పాటు కనీసం వాహన డ్రైవింగ్ (ద్విచక్ర, నాలు గు చక్రాల) లైసెన్సు కలిగి ఉండాలి. 2024, ఆగస్టు కన్నా ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్న వారికే ప్రాధాన్యత.

ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ- 

మహిళా కార్మికులు చేసుకున్న దరఖాస్తులను సీపీపీ జనరల్ మేనేజర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించి కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులను సిరిసిల్లలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం ఖాళీల ఆధారంగా నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరి- 5 డిసిగ్నే షన్‌తో సంబంధిత ఏరియాలకు పంపిస్తాం.

 బలరాం నాయక్, సీఎండీ, సింగరేణి