15-01-2026 01:49:12 AM
ఉట్నూర్, జనవరి 14 (విజయక్రాంతి) : రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన నాగోబా జాతర .. దేశంలో ఆదివాసి గిరిజనులు జరుపుకునే జాతరలలో రెండవ అతిపెద్ద జాతరగా పేరు గాంచింది. ఒకప్పుడు నాగోబా జాతర వచ్చిందంటే చాలు ఆదివాసీ గిరిజనుల సంప్రదాయ ఆటలతో సందడి నెలకొనేది.. అలాం టిది గత 11 ఏళ్లుగా జాతరలో ఆదివాసి సాం ప్రదాయ ఆటలను మర్చిపోయారు.. గతంలో సాంప్రదాయ ఆటల్లో ముఖ్యంగా ఎడ్ల బండి పోటీ, గిల్లి దండు, విల్లు విద్య, తదితర ఆటలను నిర్వహించేవారు.
సాంప్రదాయ ఆటలు నాగోబా జాతర లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే వి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ గ్రామాలకు చెందిన వారు సైతం ఆదివాసీ సాంప్రదాయ పోటీల్లో గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. ఈ మధ్యలో పోటీలు నిర్వహించడం మానేశారు. 2012 లో ఐటీడీఏ పీవో గా బాధ్యతలు స్వీకరించిన ఆర్వీ కర్ణన్ ఈ విషయం తెలుసుకుని నాగోబా జాతరలో ఆదివాసుల సాంప్ర దాయ క్రీడల నిర్వహణకు మరోసారి శ్రీకారం చుట్టారు. 2014 వరకు జాతరలో సంప్రదా య పోటీలను పటిష్టంగా నిర్వహించారు. ఆయన బదిలీ కాగానే సంప్రదాయ ఆటలను ఐటీడీఏ అధికారులు నిర్వహించడం మానేశారు.
ఆటలు చూసేందుకు విదేశీయుల రాక
అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహించే ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ ఆటల పోటీలను తిలకించేందుకు విదేశీయులు ప్రత్యేకంగా వచ్చేవారు. వందల ఏళ్ల నుంచి 2001 వరకు ప్రతి ఏటా నాగోబా జాతరలో నిర్వహించే సాంప్రదాయ ఆటల పోటీలను చేసేందుకు విదేశీయులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేవారు.
2001 తర్వాత ఆదివాసి సాంప్రదాయ పోటీలు నిర్వహించడం మానేయడంతో విదేశీయులు సైతం రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ 2013, 2014లో సాంప్రదాయ క్రీడలను మళ్ళీ నిర్వహించేందుకు చర్యలు తీసుకొన్నారు. 2014లో నిర్వహించిన ఆదివాసి సాంప్రదాయ క్రీడలను తిలకించుటకు విదేశీయులు సైతం హాజరయ్యారు.
సంప్రదాయ ఆటలను నిర్వహించాలి
ప్రతి సంవత్సరం నిర్వహించే నాగోబా జాతర లో అనాదిగా వస్తున్న సంప్రదాయ ఆటల పోటీలను నిర్వహించాలని ఆదివాసీల నుండి మళ్ళీ డిమాండ్ మొదలైంది. సంవత్సరాంలో ఒకసారి జరిగే ఈ జాతరలో క్రీడల నిర్వహణతో ఆదివాసీల సంప్రదాయ ఆటలను గుర్తింపు లభిస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆదివాసీ సాంప్రదాయ క్రీడలను జాతరలో నిర్వహించాలని ఆదివాసి గిరిజనులు కోరుతున్నారు.