15-01-2026 12:00:00 AM
“సంక్రాంతి అంటే కోనసీమ.. కోనసీమ అంటే సంక్రాంతి... తెలుగు నేలపై సంక్రాంతి పండుగను.. ఆ పండుగ పూర్తి వైభవంతో చూడాలంటే కోనసీమకు మించిన ప్రదేశం మరొకటి లేదు. ఇక్కడి ప్రభల తీర్థం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, రంగురంగుల పూలతో, వస్త్రాలతో అలంకరించిన భారీ ప్రభలను భుజాలపై మోస్తూ పొలాల గట్ల వెంబడి ఊరేగింపు.. కనువిందు వర్ణనాతీతం. ఏకాదశ రుద్రుల వైభవానికి ప్రతీకగా.. ఒకే చోట 11 గ్రామాల ప్రభల సంఘమం.. కోనసీమ ఐక్యమత్యానికి నిదర్శనమై.. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, 400 ఏళ్ల చరిత్ర గల ‘ప్రభల తీర్థం’ చూడాలంటే.. జగ్గన్న తోటకు రావాల్సిందే.. చూసి ‘శరభ.. శరభ.. ప్రభల భళా...’ అని తీరాల్సిందే..! ప్రతి హృదయం కోనసీమ అందాల హోయల తీరాల పల్లకీ పాడాల్సిందే..!!”
గోదావరి నది పాయల మధ్య వెలసిన ఈ ప్రాంతం పచ్చని కొబ్బరి తోటలు, పొలాల గట్లు, ఏరులతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం అనడంలో ఎటు వంటి సందేహం లేదు. సంక్రాంతి సమయం లో కోనసీమకు వెళ్తే మనం ఒక సరికొత్త లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. కోనసీమ లో పండుగ సంబరాలు భోగి నుంచే అంబరాన్నంటుతాయి. ముఖ్యంగా జగ్గన్నపేట వంటి గ్రామాల్లో జరిగే ప్రభల ఉత్సవం చూడటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఆధ్యా త్మిక వేడుక మాత్రమే కాదు.. కోనసీమ ఐక్యమత్యానికి నిదర్శనంగా చెబుతుంటారు.
400 ఏళ్ల చరిత్ర
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివా రు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమ నాడు ఈ ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి ఉన్న చరిత్ర మామూలుది కాదు. ఏకంగా 400 ఏళ్ల నుంచీ ప్రభ ల తీర్థానికి గొప్ప చరిత్ర ఉంది. కోనసీమ చుట్టుపక్కల 11 గ్రామాల ప్రభలు ఈ తీర్థం లో పాలుపంచుకుంటాయి. ఈ తోటని జగ్గ న్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు.
అయినా కూడా ఆ స్థలానికి ఎంతో పవిత్రత ఉంది. లోక కళ్యాణార్థం ప్రతీ ఏడాది కనుమ రోజు న ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి కనుమ రోజున జగ్గ న్నతోటలో ప్రభల తీర్థం నిర్వహిస్తున్నారు.
ఏకాదశ రుద్రుల వైభవం
జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు చుట్టుపక్కల గ్రామాల నుంచే తరలివస్తాయి. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వరస్వామి, పెదపూడి నుంచి మేనకేశ్వరస్వామి, ముక్కామల నుంచి రాఘవే శ్వర స్వామి, మొసలపల్లి నుంచి మధుమానంత భోగేశ్వరస్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు జగ్గన్నతోటలో కనుమ రోజు కొలువుతీరుతాయి.
ప్రభల తయారీ ఎంతో ప్రత్యేకం
ప్రభల తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. సంక్రాంతికి 10 రోజుల ముందే ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు. వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి కొబ్బరి పీచు తాడుతో బలంగా కడతారు. తరువాత వాటిపై రంగు రంగులు వేయడంతో ప్రభ అత్యంత అందంగా తయారవుతుంది. తర్వాత రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరిస్తారు. దానిపై ఏకాదశ రుద్రుల్లో తమతమ గ్రామాలకు చెందిన విగ్రహాలను పెట్టి ప్రభను ఊరేగింపుగా ‘శరభ.. శరభ..’ అంటూ పరమశివుడి నామం స్మరిస్తూ.. తీసుకొస్తారు.
విశేషమేమిటంటే ప్రభలను తీసుకొచ్చే దారిలో కౌశికనది కూడా ఉంటుంది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభను నదిలో నుంచే తడవకుండా తీసుకురావడం ప్రతీసారీ ప్రత్యేకమే. దాదాపు 20 నుంచి 25 మంది కలిస్తే గానీ ప్రభలు పైకి లేపలేరు. నదీదాటేటప్పుడైతే 50 నుంచి 60 మంది ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఉంటారు. ఆయా గ్రామాల ప్రజలు కనుమ రోజున జగ్గన్న తోటకు వచ్చి దర్శించుకుని వెళతారు. తీర్థం పూర్తయిన తర్వాత వచ్చిన దారిలోనే ప్రభలను తిరిగి తమ తమ గ్రామాలకు తీసుకెళతారు. గ్రామానికి వెళ్లిన తర్వాత రాత్రి ఊరేగింపు కూడా ఉంటుంది.
రాష్ట్ర పండుగగా గుర్తింపు
2023 జనవరి 26న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుఫున గణతంత్ర దినోత్సవాలలో ప్రభల తీర్థ శకటం అరుదైన గుర్తింపు పొందింది. కాగా జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని ఇటీవలే ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు.ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
నరేష్, విజయక్రాంతి, అంబాజీపేట