15-01-2026 01:44:13 AM
ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 14 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు సమయం ఆసన్నమయింది. ఈ నెల 18న అర్ధరాత్రి నాగోబాకు మహా పూజలతో జాతరను మెస్రం వంశీయులు ప్రారంభిస్తారు. కాగా పవిత్ర గంగా జలం కోసం డిసెంబర్ 31న మహా పాదయాత్ర చేపట్టిన మెస్రం వంశీయులు బుధవారం బుధవారం రాత్రి తిరిగి కేస్లాపూర్‌కు చేరుకున్నారు. ముందుగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కొలువుదీరిన ఇంద్రాయి దేవతను దర్శించుకున్న మెస్రం వంశీయులు పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.
నాగోబా దేవుడికి మహా పూజలు చేసే మెస్రం వంశీయుల మహిళలు పూజా సామగ్రితో పాటు పిల్లాపాపలతో కాలినడకన, ఎడ్లబండ్లపై ఇంద్రాయి ఆలయానికి చేరుకున్నారు. నాగోబా దేవుడి మహా పూజలకు అవసరమైన పవిత్ర గంగా జలం భూమిపై ఉంచొద్దన్న మెస్రం వంశీయుల ఆచారం ప్రకారం మర్రి చెట్టుపై భద్రతపరిచారు. మహా పాదయాత్రకు బయలుదేరినప్పటి నుంచి వారి వెంట పాదయాత్రలో మెస్రం వంశం అల్లుళ్లు పాల్గొనడం, పవిత్ర గంగ జలాన్ని చెట్టు ఎక్కి చెట్లపై భద్రపరచడం వందల ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
గారెలు చేసి ఇంద్రాయి దేవతకు నైవేద్యం
ఆదివాసీ దేవతలకు నైవేద్యంగా మినప గారెలు తయారు చేసి సమర్పిస్తుంటారు. భక్తులు దేవతలకు నైవేద్యంగా పండ్లు, తీపి వంటకాలను సమర్పిస్తూ ఉంటారు. కానీ ఆదివాసి గిరిజనులు సంప్రదాయంగా తమ దేవతలకు ఆలయం వద్ద మినప పప్పును రుబ్బి అక్కడే తక్కువ నూనెను వాడి ప్రత్యేకంగా గారెలు తయారు చేస్తారు. ఈ గారెలను దేవతకు నైవేద్యంగా సమర్పించారు.