12-01-2026 12:36:31 AM
మున్సిపోల్స్లో ఆశావహుల ఎదురుచూపు
నేడే ఓటర్ల తుది జాబితా ప్రకటన
వార్డు స్థానాలపై సర్వత్రా చర్చ
సంక్రాంతి తర్వాతే కొలిక్కి ?
సంగారెడ్డి, జనవరి 11(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఓవైపు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠంతో పాటు వార్డు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ వార్డులో ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో అనే దానిపై జోరుగా చర్చ సాగుతుంది. ఈనెల 12న ఓటర్ల తుది జాబితా ప్రకటించాక రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశ ముంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రొటేషన్ విధానం అమలు చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.
మున్సిపల్ యూనిట్గా రిజర్వేషన్..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఈనెల 12న ప్రకటించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే దామాషా ప్రకారం సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. చైర్మన్ పీఠాన్ని రాష్ట్రం యూనిట్గా ఖరారు చేయనుండగా వార్డు కౌన్సిలర్ స్థానాలను మున్సిపల్ యూనిట్గానే కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం స్థానాలను ఖరారు చేయనుండగా మిగతా 50 శాతం వార్డులను మహిళలకు రిజర్వు చేయనున్నారు. గతంలోని రిజర్వేషన్లను కాకుండా రొటేషన్ విధానంలో కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏయే వార్డులు ఎవరికి ఖరారవుతాయనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించే మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించాకే దానిపై ఉత్తర్వులు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.
గతంలో ఇలా..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను వివిధ కేటగిరిగా రిజర్వ్ చేశారు. ప్రస్తుతం రొటేషన్ విధానం అమలు చేయనుండటంతో ఈసారి ఏ కేటగిరికీ రిజర్వు అవుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే వార్డులు సైతం జనాభా దామాషా ప్రకారం రిజర్వు చేయనున్నారు. ఈ క్రమంలో మెజార్టీ వార్డుల్లో రిజర్వేషన్లు మారనున్నట్లుగా చర్చ సాగుతోంది.
ఇందులో పాతకాపులకు ఎంత మందికి కలిసి వస్తుందనే దానిపై ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన ఓటరు జాబితాలోని మెజార్టీ ఓటర్లు, గతంలో వచ్చిన రిజర్వేషన్లను పరిశీలిస్తూ అంచనా వేస్తున్నారు. అయితే ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్లు కేటాయిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వీటిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత రానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.