12-01-2026 12:48:28 AM
మోతె, జనవరి 11 : రోజురోజుకు భూముల విలువలు పెరగడంతో ఆలోచనలు అటువైపు మళ్ళీ కొందరు స్వార్ధపరులు అందిన కాడికి భూములు ఆక్రమణలు చేస్తున్నారు. ఆ స్వార్థపూరిత ఆలోచనలతోనే ఉన్న సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. దీనిలో భాగంగానే గుట్టలు, చెట్లు, పుట్టలు, చెరువులు వాగులు, వంకలు అన్ని ఆక్రమిస్తున్నారు. అసలు కొన్ని కుంటలైతే అసలు నామ రూపాలు లేకుండా మాయమైయ్యాయి. అసలు కొన్నిచోట్ల అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోలేనంత దారుణమైన పరిస్థితికి చేరుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థంచేసుకోవచ్చు.
ప్రభుత్వాలు ఎంత సహజ సంపధలను కాపాడే ప్రయత్నాలు చేసిన మనిషి యొక్క స్వార్థపూరిత ఆలోచనల ముందు అవి నిలవడం లేదు. ఈ క్రమంలోనే గుట్టలు, పుట్టలు పూర్తిస్థాయిలో కబ్జాకు గురైతున్నాయి. రాత్రికి రాత్రి గుట్టలను జెసిబీలు, డోజర్లు, ప్రోక్లైన్లు పెట్టి చదును చేయడంతో పాటు మట్టిని ఎత్తి చెరువులు పూడ్చి వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నారు. ఈ తంతు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఇదే మోతె మండలంలోని తుమ్మగూడెంలో జరుగుతుంది. దీంతో స్థానికులు అందితే ఆక్రమణేనా అంటూ చర్చించుకోవడం గమనార్హం.
తరుగుతున్న గంగదేవి గుట్ట:
మండల పరిధిలోని ఉర్లుగొండ రెవిన్యూ తుమ్మగూడెం గ్రామ సమీపంలోని సర్వేనెంబర్ గల 331లో 3610 గుంటల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి (గంగాదేవి గుట్ట) ఉంది. కొందరు స్వార్ధపరుల కన్ను రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి ఈ గుట్ట మీద పడింది. ఈ గుట్టపై గడ్డి మొక్కలు, పశు గ్రాసం ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు పశువులను మేపుకోవడానికి అడ్డగా ఉండేది. పక్కనే చెరువు ఉండడంతో పశువులు, గొర్రెలను మేపడానికి తీసుకెళ్ళి చెరువులో నీళ్లు తాపి మళ్లీ మేపుకునేవాళ్లు. ఇప్పుడు ఈ స్వార్థపూరిత ఆలోచనలతో ఆ పరిస్థితి చేదాటిపోతుంది. కొందరు వ్యక్తులు ఆక్రమించి దాన్ని మొత్తం చదును చేసి సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ భూమి అని తెలిసినా ఎక్కడ తగ్గకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పెద్దపెద్ద జెసిబిలు, డోజర్లు, కంప్రెజర్లతో గుట్టను తవ్వుతూ బ్లాస్టింగ్ చేస్తూ పెద్ద పెద్ద బండరాళ్లను కూడా పగుల కొట్టి పక్కకు నెట్టి దాన్ని చదును చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా రోడ్డుకు అతి సమీపంలో ఉన్నా యధేచ్చగా చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే సుమారు ఐదుఎకరాల మేర ఆక్రమించేశారు. ఇలానే వదిలేస్తే, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే రానున్న ఒకటి, రెండు సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు చెబుతున్నారు.
అడ్డుకునే వారేరి :
ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద బ్లాస్టింగ్ చేస్తూ ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ భూమిలోని రాళ్లను తవ్వి యధేచ్చగా డోజర్ లను పెట్టి చదును చేస్తున్న ఏ ఒక్కరు అడ్డుకోవడం లేదనే విమర్శలు స్థానికంగా వస్తున్నాయి. ఈ అడ్డుకోకపోవడానికి కారణాలు ఎవరికీ అర్థం కావట్లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఆ ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్న ఎవ్వరు పట్టించుకునే వారు లేరని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి ఆక్రమణకు గురవుతున్న గంగాదేవి గుట్టను కాపాడాలని పరువురు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వ భూములు ఎవరు అక్రమన చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాం. గంగదేవి గుట్టను పరిశీలన చేస్తాం. దానిని ఆక్రమిస్తే చట్టపరంగా తగు చర్యలు తప్పవు.
- వెంకన్న, తాసిల్దార్, మోతె