25-01-2025 01:20:30 AM
రూ.6.76 లక్షల నకిలీ నోట్లు లభ్యం
కామారెడ్డి, జనవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రూ.500 నకిలీనోట్ల ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు కేసుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేసి, రూ.6.76 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. గాంధారి మండలం చద్మాల్‌తండాలో ఏటా లక్ష్మమ్మ జాతర అనంతరం గుడిలో మిగిలిన డబ్బులను ఇతరులకు వడ్డీ కి ఇస్తారు.
ఈసారి కూడా అలాగే ఇచ్చారు. అయితే కొందరికి నకిలీ నోట్లు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వడ్డీకి ఇచ్చే సమయంలో లక్ష్మమ్మ గుడిలో క్యాషియర్‌గా వ్యవహరిస్తున్న చద్మల్‌తండాకు చెందిన మాండు గోపాల్, అదే తండాకు చెందిన మాలి రవీందర్ కలిసి కొన్ని నకిలీ రూ.500 ల నోట్లను కలిపి ఇచ్చారని తెలిసింది. సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు తమ సిబ్బందితో నకిలీనోట్ల ముఠాపై విచారణ జరిపారు.
మాం డు గోపాల్, మాలి రవీందర్‌లను విచారించగా నకిలీ నోట్లు చెలామణి చేసి, వచ్చిన డబ్బులను పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నకిలీ నోట్లను వారికి డప్పు తండాకు చెందిన బడావత్ సగ్రామ్ ఇచ్చారని చెప్పారు. బడావత్ సంగ్రామ్‌ను విచారించగా అతడికి గత కొన్ని నెలల క్రితం నిజామాబాద్‌కు చెందిన తిరుపతి అలియాస్ రాజు పరిచయం అయ్యా డు. అతడి తన వద్ద ఉన్న నకిలీ నోట్లను చెలామణి చేస్తే కమీషన్ ఇస్తానని చెప్పడంతో సంగ్రామ్ ఒప్పుకున్నట్టు చెప్పారు.
ఇలా పోచారం తండాకు చెందిన మూడు రవీందర్, కొనాపూర్ సోమ్లానాయక్ తండా కు చెందిన దరావత్ చందర్‌తో కలిసి నిజామాబాద్‌కు వెళ్లారు. అక్కడ తిరుపతి అలి యాస్ రాజుతోపాటు మగ్గిడి కిషన్ అలియా స్ వెంకట్, రాంటెంకి భానుప్రసాద్‌లతో బేరం కుదుర్చుకున్నారు. సంగ్రామ్, రవీందర్, చందర్ తెచ్చిన రూ.౧.20 లక్షలు తీసుకుని రూ.5 లక్షల నకిలీనోట్లు ఇచ్చారు.
సంగ్రామ్, రవీందర్, చందర్ వాటిని తీసుకెళ్లి లెక్కించగా రూ.రెండు లక్షలే ఉండటంతో మోసపోయామని గ్రహించారు. వాటిని మార్చేందుకు సంగ్రామ్‌కు పరిచయమున్న మాలి రవితో ఒప్పందం విషయం చెప్పి రూ.లక్షా50వేల నకిలీ నోట్లు ఇచ్చాడు. మా లి రవి అందులో నుంచి రూ.20 వేల నో ట్లను గుడి క్యాషియర్‌గా ఉన్న మాండు గో పాల్‌కు ఇచ్చాడు.
ఆ తర్వాత ప్రజలకు మిత్తి కి ఇచ్చే సందర్భంలో నోట్ల కట్టలో నకిలీ రూ. 500 నోట్లను కలిపారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మాండు గోపాల్, మాలి రవిందర్, బడావత్ సంగ్రామ్, మూడు ర వీందర్, దారవత్ చందర్, మగ్గిడి కిషన్, రా ముటింకి భానుప్రసాద్‌లను అరెస్ట్ చేసి, 9 ఫోన్లు, బైక్, రూ.1.76 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.
తుక్కుగూడలో ఒకరి అరెస్టు
మేడ్చల్(విజయక్రాంతి): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నకిలీ నోట్ల తయారీ గుట్టు రట్టు చేశారు. వివరాలను సీపీ సుధీర్‌బాబు శుక్రవారం వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కర్లీ నవీన్‌కుమార్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. మల్టీమీడియా, గ్రాఫిక్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రావీణ్యం ఉంది. కొంతకాలం ఉబేర్, రాపిడో డ్రైవర్‌గా పని చేశాడు.
2023 ఆగస్టులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సులభంగా డబ్బులు సంపాదించడానికి నకిలీ నోట్లు తయారుచేసి చెలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు. తయారీ విధానాన్ని ఆన్‌లైన్‌లో వెతికాడు. ముద్రణకు 45 జీఎస్‌ఎమ్ పేపర్ కోసం కోల్‌కతా నుంచి తెప్పించాడు. కర్నూలుకు చెందిన మిత్రుడు ఒకరు ప్రింటింగ్ మిషన్‌కు ఆర్థిక సాయం చేయడంతో ప్రింటింగ్ మొదలుపెట్టాడు.
మొదటిసారి సరిగా రాకపోవడంతో మళ్లీ థ్రెడ్ పేపర్ తెప్పించి అసలు నోట్ల మాదిరి ముద్రించాడు. వీటిని తుక్కుగూడలో చలామణి చేయడానికి ప్రయత్నించగా మహేశ్వరం జోన్ ఎస్‌ఓటి, పహాడీ షరీఫ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ రూ.5 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు పట్టుకున్నారు. ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.