calender_icon.png 16 September, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ పోరు.. ఎవరు చూపేనో జోరు

16-09-2025 12:32:59 AM

  1. త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు
  2. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ
  3. ఓటరన్న ఎవరి పక్షాన నిలిచేనో!
  4. సామాన్యుడికి అర్థంకాని పొత్తుల కథలు
  5. మహిళా ఓటర్ల మద్దతు ఎవరికో? 
  6. మహిళా ఆకర్షక పథకాలు తెరమీదకి..
  7. తేజస్వి ప్రకటనతో డైలమాలో ‘ఇండియా’
  8. బీహారీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్న నితీశ్‌కుమార్ !

పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్ అసెంబ్లీకి అతి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేసిన నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ మధ్యలోనే ఎన్డీయే కూటమికి బాయ్ బాయ్ చెప్పి ఇండియా (అప్పటి యూపీఏ)లో చేరిపోయింది.

మళ్లీ కొద్ది రోజులకు మనసు మార్చుకున్న నితీశ్ కుమార్ కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పి బీజేపీ సారథ్యం వహిస్తున్న ఎన్డీయే కూటమిలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీయే కూటమి తరఫునే బీహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్’ పాదయాత్ర వల్ల బీహార్‌లో ఇండియా కూటమికి ఎంత మేర ప్రయోజనం ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది.

నితీశ్ కుమార్ దూరం అయిన తర్వాత  కాంగ్రెస్‌కు లాలూ పార్టీ ఆర్జేడీ మాత్రమే మిగిలింది. కానీ ఇటీవలే ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్ బాంబ్ పేల్చారు. ‘మేము బీహార్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం’ అని ప్రకటించారు. ఇక ఇన్ని రోజులు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ‘జన్ సురాజ్’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ తప్పకుండా ఓట్లు చీలుస్తానని చెబుతున్నాడు.

కొన్ని సర్వేలు కూడా ఆయన కింగ్ మేకర్ అవుతాడని చెబుతున్నాయి. బీహార్‌లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వారి ఓట్లు ఎటువైపు పడుతాయా అనే సంశయం అందరిలోనూ నెలకొంది. బీహార్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది. వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీ ఈ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలనే ఆతృతతో ఉంది.

వరుస విజయాలతో ఉండటం, బీహార్‌లో అధికార పార్టీతో పొత్తులో ఉండటం ఎన్డీయే కూటమికి కలిసొచ్చే ఆంశమని అంతా భావిస్తున్నారు. ఇటీవలే ఓటర్ అధికార్ యాత్ర చేపట్టడం ద్వారా ప్రజల్లో మైలేజ్ పెరిగిందనే భావనలో ఇండియా కూటమి ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా బీహార్‌ను నితీశ్ కుమారే పాలిస్తున్నారు.

ఆయన కూటములు మార్చినా ఏం చేసినా సీఎం మాత్రం నితీశ్ కుమారే. ఈ సారి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నితీశ్ సారథ్యంలోని బీహార్ సర్కార్ బీహారీలకు అనేక వరాలు గుప్పించింది. ఈ వరాలు కలిసి వచ్చి మరి నితీశ్ సర్కారు మరోసారి గెలుస్తుందో లేక ఈ సారి ఓటర్లు వేరే పార్టీకి పట్టం కడతారో వేచి చూడాలి. 

అర్థం కాని పొత్తుల కథలు..

బీహార్ అసెంబ్లీ పొత్తుల కథలు సామాన్యుడికి ఏ మాత్రం సమజ్ కావడం లేదు. తాజాగా ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ చేసిన ప్రకటన చూస్తే ఎవరికైనా సరే మతిపోవడం ఖాయం. ఇండియా కూటమిలో ఉన్న తేజస్వి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కూడా పాల్గొన్నాడు. ఇది చూసిన అందరూ కాంగ్రెస్+ఆర్జేడీ ఈ ఎన్నికల్లో సీట్లు పంచుకుంటాయని భావించారు.

పరిస్థితులు కూడా అలాగే కనిపించాయి. కానీ ఆ రెండు పార్టీలకు ఏం చెడిందో.. ఎక్కడో చెడిందో తేజస్వి అందరినీ షాక్‌కు గురి చేస్తూ బాంబ్ పేల్చారు. ముజఫర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి రాష్ట్రంలోని 243 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. ‘ఈ దఫా నా ముఖం చూసి ప్రజలు ఓట్లు వేయాలి.

బీహార్ నుంచి ఓట్లు గుంచుకుంటున్న ఎన్డీయే, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు కడుతోంది. ఈ ఆటలు ఇకపై సాగవు’ అని పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 స్థానాల్లో, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేశాయి. ఈసారి మాత్రం తేజస్వి ప్రకటనతో అంతా అయోమయంలో పడ్డారు. ఇండియా కూటమిలో కొత్తగా జేఎంఎం, ఎల్జేపీ పార్టీలు చేరాయి. 

మహిళా ఓటర్లే ఎక్కువ..

బీహార్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6.4 శాతం మేర ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఈసీ వెల్లడించింది. వివిద దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ వ్యాప్తంగా 59.39 శాతం మంది మహిళా మణులు ఓటేయగా.. పురుష అభ్యర్థులు కేవలం 53.28 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ ప్రకటించింది.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా మహిళలే పురుషుల కంటే ఎక్కువ మంది ఓటేయడం గమనార్హం. అందుకోసమే పార్టీలు మహిళా ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. నితీశ్ కుమార్ పార్టీ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’, మహిళా ఉద్యోగుల కోసం హౌసింగ్ స్కీమ్, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం ‘బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్’ వంటి పథకాలను ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్న నితీశ్ పార్టీతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చాక మహిళలకు మేలు చేస్తామని పలు స్కీమ్స్ ప్రకటిస్తోంది. 

ఓటర్ అధికార్ యాత్ర గేమ్ చేంజర్ అయ్యేనా? 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రతో మహాగట్‌బంధన్‌కు మైలేజ్ వస్తుందని చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు గంపెడాశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కూటమిలో ఉన్న ఆర్జేడీకి తక్కువగానే సీట్లు వచ్చాయి. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మా త్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా విడుదలవుతున్న సర్వేలు ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతాడని చెబుతున్నాయి. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో ఎంతో పోరాడిన రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండి యా కూటమికి 35.8 శాతం ఓట్లు వస్తాయని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి.