calender_icon.png 16 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవాలు తీసుకపోయిర్రు.. పైసలియ్యలే

16-09-2025 01:23:24 AM

  1. కాగితాలపైనే గొర్రెల కొనుగోళ్లు, రవాణా 
  2. మాకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించలేదు
  3. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏపీ రైతుల వాంగ్మూలం
  4. గుంటూరు, పల్నాడు జిల్లాల కాపరులు, విక్రేతలను విచారించిన ఈడీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణను కుదిపేసిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నిన ఈ భారీ స్కాంలో కీలక వాంగ్మూలాలను నమోదు చేస్తూ, సూత్రధారుల ఉచ్చును బిగిస్తోంది. ఈ నేపథ్యంలో పథకం కింద గొర్రెలను సరఫరా చేసినట్లుగా రికార్డుల్లో ఉన్న ఏపీ రైతుల కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

సోమవా రం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన గొర్రెల కాపరులు, విక్రేతల నుంచి వాంగ్మూలాలను రికార్డు చేసింది. విచారణకు హాజరైన గొర్రెల కాపరులు, విక్రేతలు తాము ఎదుర్కొన్న మోసాలను అధికారుల ముందు ఏకరువు పెట్టారు. పథకం కింద గొర్రెలను సరఫరా చేసినా తమకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించలేదని వాపోయా రు.

దళారులు, అధికారులు కుమ్మక్కు నామమాత్రంగా డబ్బులు చేతిలో పెట్టి, మిగిలిన మొత్తాన్ని స్వాహా చేశారని తెలిపారు. ము ఖ్యంగా దళారి మొయినుద్దీన్ వంటి వ్యక్తులు తాము అమ్మిన గొర్రెలకు సంబంధించిన డబ్బును కాజేశారని స్పష్టం చేశారు. కేవలం కాగితాలపై మాత్రమే గొర్రెల కొనుగోళ్లు, రవాణా జరిగినట్లు చూపించి, ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని వారు తమ వాం గ్మూలంలో పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన ఈ కీలక సమాచారంతో, వారిని సాక్షులుగా పరిగణిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసును మరింత బలోపేతం చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.

ఉచ్చు బిగిస్తున్న ఈడీ

ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పశుసంవర్ధక శాఖ సీఈవో రామచందర్‌నాయక్, మాజీ ఓఎస్‌డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్‌డీ ఇంట్లో లభించిన కీలక పత్రాలు ఈ కేసులో రాజకీయ ప్రమేయాన్ని సూచిస్తున్నాయి. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, జూలై 29న హైదరాబాద్‌లోని ఆరు కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో నకిలీ చెక్‌బుక్కులు, పాస్‌బుక్‌లతో పాటు భారీగా నగదు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. దళారి ఖాజా మొయినుద్దీన్, అతడి కుమారుడు ఈడీ దర్యాప్తు ప్రారంభం కాగానే దుబాయ్‌కు పరారయ్యారు. ప్రస్తుతం బాధితుల వాంగ్మూలాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈ కేసులో తెరవెనుక ఉన్న పెద్దల పాత్రను నిగ్గు తేల్చేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పక్కా ప్లాన్‌తో ప్రజాధనం లూటీ

పేద గొల్ల కురుమలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో 2017లో రూ.4,500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, కొందరు ఉన్నతాధికారులు, దళారులు, రాజకీయ నాయకుల అండతో దీనిని అవినీతికి అడ్డాగా మార్చారు. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, వారి పేరుతో నిధులు డ్రా చేశారు. గొర్రెలను కొనుగోలు చేయకుండానే కొన్నట్లు, రవాణా చేయకుండానే చేసినట్లు నకిలీ రికార్డులు సృష్టించారు.

ఈ విధంగా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని వందల సంఖ్యలో ఉన్న బినామీ, డమ్మీ బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. విచారణలో భాగంగా, ఇలాంటి 200కు పైగా డమ్మీ ఖాతాలను ఈడీ గుర్తించింది. మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ ఖాతాల నుంచి డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు తరలించినట్లు ఆధారాలు లభించాయి.

కాగ్ నివేదికలో రూ.253 కోట్ల అవకతవకలు జరిగాయని తేలగా, ఈడీ దర్యాప్తులో స్కాం విలువ వెయ్యి కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం అధికారులే కాకుండా, రాజకీయ అండదండలతో దళారులు, బినామీలు కలిసి ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో బాధితులు పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు.