16-09-2025 12:48:50 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) అలైన్‌మెంట్ మార్చి రైతుల నోట్లో మట్టికొడుతున్నారని, అలైన్‌మెంట్ మార్పు దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగ ల్ మీదుగా ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మారుస్తూ పచ్చటి పొలాలను మాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్నగూడెం, గంగారం గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం హైదరాబాద్ కు వచ్చి హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అలైన్‌మెంట్ మార్పు కారణంగా రైతులు భూములు కోల్పోకుండా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయా ల వల్ల ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులకు అన్యాయం జరుగుతుందని, అలైన్‌మెంట్ మార్పుతో బడుగు బలహీ నవర్గాలకు చెందిన రైతులే నష్టపోతున్నారని వాపోయారు. రియల్టర్లు, కాంగ్రెస్ నేతల భూములు నష్టపో కుండా, కేవలం రైతులు నష్టపోయేలా అలైన్‌మెంట్ ప్రతిపాదించడం దారుణమన్నారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఓఆర్‌ఆర్ నుంచి 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలోమీటర్లకు కుదించడంపై నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వానికి పట్టిం పు లేదని నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ మున్ముందు ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.
ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్
22 నెలల ప్రజాపాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’ ద్వారా విమర్శించారు. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు, ఫీజురీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడం తో కాలేజీలు బంద్ అయ్యాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బంద్, నిధుల్లేక గ్రామాల్లో పారిశుధ్య పనులు బంద్, డీజిల్ పోయించేందుకు నిధుల్లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బంద్, రైతులకు రుణమాఫీ బంద్, సన్నాలకు బోనస్ బంద్, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బంద్, అన్నదాతకు యూరియా బంద్’ అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతగాని పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతు న్నారని, కాలేజీ, ఆసుపత్రి యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.