calender_icon.png 11 September, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు

11-09-2025 06:14:29 PM

మట్టిపల్లి సైదులు..

మోతే: గురువారం మోతే మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇండ్ల మాల్సుర్ స్మారక స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బిజెపి ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు చెప్తున్నదని అన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, ఠాన్ నాయక్, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు అశువులు బాసారని అన్నారు. వీళ్లంతా కుల, మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో సోయబుల్లాఖాన్, షేక్ బందగి, మగ్దూం మోహినుద్దీన్, జవ్వాద్ రజ్వీ, ఆలం ఖుందుమీరి, షౌకత్ ఉస్మాని  తదితర ముస్లిం నాయకులు నిజాం పైన పోరాటం చేశారని గుర్తు చేశారు. 

ప్రజలను పట్టిపీడించింది, వెట్టిచాకిరి చేయించుకున్న వారిలో విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారం ప్రతాప రెడ్డి లాంటి హిందువులైన జమీందారులు, జాగిర్దారులు, దొరలు, దేశ్ ముఖ్ లు,  భూస్వాములు, పటేల్, పట్వారిలే మెజారిటీగా ఉన్నారని, బిజెపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుమితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు.  మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన  బాటలో పయనించడమేనని, నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు. అనంతరం సిపిఎం పార్టీ జెండాను సిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, చర్లపల్లి మల్లయ్య, దోసపాటి శ్రీను, కిన్నెర పోతయ్య తదితరులు పాల్గొన్నారు.