11-09-2025 08:20:56 PM
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్..
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇందిరమ్మ ఇండ్లు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల, మున్సిపాలిటీల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకుని, తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరు నిర్మాణపు పనులను పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు అన్ని సహాయ సహకారాలను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రస్థాయిలో గత వారం 20వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 15వ స్థానానికి ఎదిగిన విశేష పురోగతిని కలెక్టర్ గుర్తించారు. కృషి చేసిన అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
గద్వాల మున్సిపాలిటీలో కొత్తగా 141 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మార్క్‌అవుట్ నుంచి ప్రతి దశలో పనిని వేగవంతంగా,నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు.స్వయం సహాయక సంఘాలా 901 మందికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులకు మంత్రివర్యుల అందించిన తొమ్మిది కోట్లు పదకొండు లక్షల పది వేల రూపాయల రుణాల చెక్కును మహిళా సంఘాల సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమ చేయాలని సూచించారు. బ్యాంక్ రుణ ప్రక్రియను లీడ్ బ్యాంక్ మేనేజర్ పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. మండలాల వారీగా బ్యాంక్ రుణాలు లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ అయిన తేదీ, వాటి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో స్వయం సహాయక సంఘాలలో లేని వారిని గుర్తించి, వారిని సంఘంలో వెంటనే చేర్పించి ఇళ్ల నిర్మాణ అవసరాలకు సంబంధించిన రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ప్రధాన లక్ష్యంగా,ప్రతి దశను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు, డిపిఓ నాగేంద్రం, హౌసింగ్ పీ.డి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.