11-09-2025 08:05:08 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు సహా తదితరాంశాలపై కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి ఎంపీడీవోలతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపాలిటీలలో చాలా నెమ్మదిగా గ్రౌండింగ్ సాగుతోందని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వార్డ్ ఆఫీసర్లతో లబ్ధిదారులందరినీ పిలిపించి గ్రౌండ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఎంపీడీవోలు ఏపీఎంలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు ఇప్పించే సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. ఇటీవల డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించి తెలియజేయాలన్నారు. సమావేశంలో డిఆర్డిఓ ఉమాదేవి, హౌసింగ్ డిఈ విఠోబా, డి డబ్ల్యు ఓ సుధారాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.