calender_icon.png 20 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం ఎస్సై కాళ్లు మొక్కిన రైతు

20-09-2025 12:33:15 AM

తుంగతుర్తిలో రాత్రిపూట ఆందోళన చేసిన  రైతులు

సొసైటీ ఆఫీసులోనే తలదాచుకున్న సొసైటీ సిబ్బంది

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస.. యూరియా విషయంలో లేకుండా పోయిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం రాత్రి  సొసైటీ  కార్యాలయం ఎదుట  మెయిన్ రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో సొసైటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ క్రాంతి కుమార్ తన సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా రైతులు తోసుకు రావడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతి కుమార్ అక్కడికి రాగా... ఓ రైతు ఆయన కాళ్లపై పడ్డాడు.

యూరియా బస్తా ఇప్పించండి సారు.. అని వేడుకున్నాడు. యూరియా కోసం కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రూట్ లో వచ్చిన వాహనాలను  నిలిపివేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంత ఘర్షణ జరుగుతున్నప్పటికీ సొసైటీలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం తాళాలు వేసుకుని లోపలనే ఉండడం గమనార్వం. ప్రతిరోజు డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ కూడా యూరియా బస్తాలను, సొసైటీ వెనక గేటు నుండి దోచుకుంటున్నారని రైతులే విమర్శిస్తున్నారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ అయ్యే విధంగా  కృషి చేయాలని కోరుతున్నారు.