03-05-2025 01:08:41 AM
అయోమయంలో మిల్లర్లు ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు పై నీలి నీడలు
కరీంనగర్, మే 2 (విజయ క్రాంతి): యాసంగి ధాన్యం కొనుగోలు ఆరంభమైనప్పటి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. మిల్లర్లు కోటి రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం ఇస్తామని అధికారులు తేల్చిచెప్పడంతో సిరిసిల్లతోపాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ధాన్యం సేకరణకు మిల్లర్లు వెనుకడుగు వేస్తుండడంతో ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఆందోళనబాట పట్టారు.
శుక్రవారం వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండల కేంద్రంలో రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. అలాగే ప్రభుత్వం చెల్లిస్తానన్న బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న స్తబ్దత కారణంగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి పది సంవత్సరాలుగా తమకు రావాల్సిన మిల్లింగ్ చార్జీలు, రవాణా చార్జీలు చెల్లించాలని ఒకపక్క మిల్లర్లు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వ సూచన మేరకు అధికారులు కోటి రూపాయల బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అని చెప్తుండడం, జగిత్యాల జిల్లాలో సీఎం ఆర్ బకాయిలు చెల్లిస్తేనే ధాన్యం సేకరణకు అనుమతిస్తామని తేల్చిచెప్పడంతో ఇటు ధాన్యం పండించిన రైతులు, అటు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు ఆందోళన పడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2022-23లో నిర్వహించిన ధాన్యం టెండర్ల ఎఫెక్ట్ మిల్లర్లపై పడింది. టెండర్ ధాన్యం ద్వారా మిల్లర్లు ఇబ్బందులకు గురయ్యారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ధాన్యం ఎత్తకుండా ధా న్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై ఒత్తిడి కూడా తెచ్చారు. ధాన్యం ఉన్న మిల్లర్ల దగ్గర నుండి ధాన్యం తీసుకోకుండా డబ్బులు ఇవ్వాలని డి ఒత్తిడి చేయడం, తదితర కారణాల వల్ల మిల్లర్లు అప్పుడు ఇబ్బంది పడ్డారు.
తాజాగా బ్యాంకు డిపాజిట్ ముందుకు తీసుకురావడంతో మరోమారు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు కాకుండా గోదాంలకు తరలించే పరిస్థితి నెలకొంది. ధాన్యం సేకరణ విషయంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్టిలో పెట్టుకొని అధికారులు గత రెండు రోజుల నుండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహించిన జగిత్యాల జిల్లా ఉప్పుముడుగు సహకార సంఘం కార్యదర్శిపై ఆ జిల్లా కలెక్టర్ వేటు వేశారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి తిరుపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే జిల్లాలో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ తాజాగా అల్టిమేటం కూడా జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకాలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లోపు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ధాన్యం కొనుగోలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారు లకు తాజాగా నిర్దేశనం చేశారు.
జిల్లాలో ఇప్పటి వరకు 99,408 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకాలు 90 వేలు కాగా, సన్నరకాలు 9 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి. సన్నరకాలకు 500 రూపాయల బోనస్ కింద ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 4 కోట్ల 38 లక్షలు చెల్లించవలసి ఉంది.
నాలుగు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా ఇంచార్జి మంత్రి అయిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెండు రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లు క్షుణ్ణంగా వివరించారు. మిల్లర్లు, అధికారులకు మధ్య నెలకొన్న పరిస్థితులను ఉత్తమ్ ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి. ఉత్తమ్ తీసుకునే నిర్ణయంపైనే ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది.