07-05-2025 04:26:29 PM
తడిసిన ధాన్యం ఆదుకోవాలని రైతుల విన్నపం..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో మండలంలోని సారంగపెల్లి, పొన్నారం, గుడిపల్లి బొక్కలగుట్ట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. నాలుగు కొనుగోలు కేంద్రాలలోని సుమారు 2000 క్వింటాళ్లకు పైగా ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నెలరోజులుగా కళ్ళాల్లోనే...
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా మండలంలో గత నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో సాగు చేసిన వరిధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికి అధికారులు ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోని కల్లాల్లోనే ధాన్యం మగ్గుతుంది. ధాన్యం సకాలంలో కాంటా కాకపోవడంతో రైతులు కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వారం రోజులుగా గాలి దుమారం వీస్తుండడంతో ఏ క్షణమైనా వర్షం పడుతుందని ఆందోళనతో రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కళ్ళాల్లోని ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆరుగాళం కష్టపడి పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకొని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.