08-09-2025 02:06:07 PM
నంగునూరు: సిద్దిపేట జిల్లా(Siddipet District)లోని నంగునూరు మండల కేంద్రం సోమవారం రైతుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారింది. సాగుకు అవసరమైన యూరియా సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడటంతో ఆగ్రహించిన రైతులు నిరసనకు దిగారు. ఎరువుల దుకాణాల వద్ద భారీగా గుమిగూడిన రైతులు.. యూరియా సరఫరాను వెంటనే పెంచాలని, అప్పటివరకు యూరియా పంపిణీకి అవలంభిస్తున్న ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్" అంటూ నినదించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.యూరియా కొనుగోలుకు అమలు చేస్తున్న ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని వెంటనే రద్దు చేయాలి. యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, ఓటీపీ విధానం తమకు తలనొప్పిగా మారిందని రైతులు వాపోయారు.